
ఉత్తర ప్రదేశ్ పోలీసింగ్ వ్యవస్థ దేశచరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా.. ఓ మహిళా పోలీసుల బృందం ఎన్‌కౌంటర్‌లో పాల్గొంది. ఈ క్రమంలో తమపై కాల్పులకు దిగిన నేరస్తుడిని చాకచక్యంగా వ్యవహరించి పట్టుకోగలిగింది. దీంతో ఆ బృందంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రత్యేక ప్రశంసలు గుప్పించారు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి ఘాజియాబాద్ లోహియా నగర్ (Ghaziabad Lohia Nagar) వద్ద మహిళా పోలీసుల బృందం ఒకటి గస్తీ నిర్వహిస్తోంది. ఆ సమయంలో స్కూటర్‌పై వెళ్తున ఓ వ్యక్తిని ఆపబోయారు. అతను పారిపోవడానికి ప్రయత్నించే క్రమంలో స్కూటర్‌తో సహా జారి పడిపోయాడు. ఆపై తన దగ్గర ఉన్న నాటు తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. దీంతో ఆ బృందం ప్రతి కాల్పులకు దిగింది.
ఈ క్రమంలో.. కాలిలో బుల్లెట్ దిగడంతో నిందితుడు లొంగిపోయాడు. అతని పేరు జితేంద్ర కుమార్ అని, ఫోన్లు, చైన్ల దొంగతనాలతో పాటు బైకుల చోరీలకు సంబంధించి 8 కేసులు నమోదు అయ్యాయని పోలీసులు వెల్లడించారు. అతని నుంచి ఓ దేశీయ తుపాకీ, రెండు కార్ట్రిడ్జులు, చోరీ చేసిన స్కూటర్, మొబైల్ ఫోన్, టాబ్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో యోగి ప్రభుత్వంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
उक्त सम्बन्ध में श्रीमती उपासना पाण्डेय, सहायक पुलिस आयुक्त नन्दग्राम की वीडियो बाइट-@Uppolice https://t.co/VOUOjuBHf8 pic.twitter.com/x9XCNGSqwh
— POLICE COMMISSIONERATE GHAZIABAD (@ghaziabadpolice) September 22, 2025
యోగి ప్రశంసలు
దేశంలో ఇప్పటిదాకా జరిగిన పలు ఎన్‌కౌంటర్‌లలో మహిళా పోలీసులు భాగంగా మాత్రమే ఉన్నారు. అయితే పూర్తిగా మహిళా పోలీసులు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొనడం విశేషం(Women Police Encounter). ఈ ఆపరేషన్‌ను మహిళా పీఎస్ స్టేషన్ హెడ్ రీతూ త్యాగీ నేతృత్వంలో జరిగింది. ముగ్గురు మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు మహిళా హెడ్ కానిస్టేబుళ్లు ఇందులో పాల్గొన్నారు.
ఉత్తర ప్రదేశ్‌లో మహిళా సాధికారత కోసం మిషన్ శక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది యోగి ప్రభుత్వం. అయితే ఈ ఘటన మహిళా పోలీసుల సామర్థ్యాన్ని ప్రతిబింబించే ఘట్టంగా ఏసీపీ ఉపాసనా పాండే అభివర్ణిస్తున్నారు. మరోవైపు.. ఈ చరిత్రాత్మక ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న మహిళా బృందానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలియజేశారు. వారి ధైర్యం, సమర్థత, నిబద్ధత.. పోలీసింగ్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని ఆయన ప్రశంసించారు.
మాఫియా, గ్యాంగులు, తీవ్ర నేరస్తులపై యోగి సారథ్యంలోని యూపీ గవర్నమెంట్ కఠిన వైఖరి అవలంభిస్తోంది. ఈ ప్రభుత్వంలో 2017 నుండి 2024 చివరి వరకు మొత్తం 10,713 ఎన్‌కౌంటర్లు జరిగాయని అధికారిక సమాచారం వెల్లడించింది. ఈ ఎన్‌కౌంటర్‌లలో 63 మంది క్రిమినల్స్ మరణించగా.. 1,708 మంది నేరస్థులు గాయపడ్డారు. మరో 5,967 మంది అరెస్ట్ అయ్యారు. పోలీస్ సిబ్బంది 401 మంది గాయపడగా.. ఒకరు వీరమరణం పొందారు.
ఇదీ చదవండి: నా 23 కోట్లు పోయాయి.. వాళ్లతో మీరు జాగ్రత్త!