
తాము ఆఫీసర్లమని చెబుతూ డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు ఇటీవల కాలంలో మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే డిజిటల్ అరెస్ట్ బారిన పడి కోట్లలో పోగోట్టుకున్నవారు అనేక మందిఉండగా, అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో వెలుగుచూసిన ఈ ఘటనలో ఓ వృద్ధుడు రూ. 23 కోట్లును పోగొట్టుకున్నాడు.
సౌత్ ఢిల్లీలోని గుల్మోహర్ పార్క్లో నివసించే రిటైర్డ్ బ్యాంకర్, 75 ఏళ్ల వృద్ధుడు నరేష్ మల్హోత్రాను ఏకంగా నెలకు పైగా డిజిటల్ అరెస్ట్ చేశారు. దాంతో ఆయన జీవితాంత పొదుపు చేసుకున్న రూ. 23 కోట్లను దోచేసుకున్నారు. నరేష్ మల్హోత్రాకు సౌత్ ఢిల్లీలోని గుల్మోహర్ పార్క్ ఒక భవనం ఉంది. అందులో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసేసి ఒంటరిగా జీవిస్తున్నారు. మరో ఇద్దరు కుమారులు విడివిడిగా నివసిస్తున్నారు.
ఆయనకు నలుగురు మనవరాళ్ళు కూడా ఉన్నారు. అతని భార్య చనిపోవడంతో ఒంటరిగానే ఉంటున్నారు. అయితే ఆయన శస్త్రచికిత్స చేయించుకుని జూలై 4న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎయిర్‌టెల్ మెయిన్ ఆఫీస్ పేరుతో ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది కూడా ఆ ఫోన్ కాల్‌ను మహిళ చేసింది.
తన ల్యాండ్‌లైన్ నంబర్ హ్యాక్ చేశారని, ఆధార్ నంబర్‌ను ఉపయోగించి ముంబైలో ఒక నంబర్ తీసుకున్నట్లు తెలిపింది. తన ఆధార్ నంబర్‌ను ఉపయోగించి బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశారని, ఈ ఖాతాల ద్వారా పుల్వామా కేసులో ఉగ్రవాదులకు ₹1,300 కోట్ల నిధులు సమకూర్చారని ఆ ఫోన్ చేసిన మహిళ తెలిపింది. దీనిలో భాగంగా ఎన్‌ఐఏ చట్టం అరెస్ట్ చేస్తామని నరేష్ మల్హోత్రాను భయపెట్టింది. మీ ఆస్తిని స్వాధీనం చేసుకుంటారు. మేము మిమ్మల్ని ముంబై పోలీస్ ప్రధాన కార్యాలయానికి కనెక్ట్ చేస్తున్నామని తెలిపింది. అనంతరం ఆ వృద్ధుడికి ఓ వీడియో కాల్ వచ్చింది.
ఈ క్రమంలోనే నరేష్ మల్హోత్రాకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, తదితర వివరాలు దోచేసింది ఆ మహిళ. తరువాత నరేష్ మల్హోత్రాపై నకిలీ చార్జిషీట్ తయారు చేసి పంపారు. ప్రతి రెండు గంటలకు తనను విచారిస్తామని ఆమె చెప్పింది. ఇది సీక్రెట్స్ యాక్ట్. మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు. మీరు ఎవరితోనైనా మాట్లాడితే, మనీలాండరింగ్ నిరోధక ఆరోపణల కింద మిమ్మల్ని అరెస్టు చేస్తారని అని బెదిరించారు. ఇలా నెల రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారు. ఈడీ, సీబీఐ, సుప్రీంకోర్టు , ఆర్బీఐ పేర్లను వాడుకుంటూ నెలరోజుల్లో రూ. 23 కోట్లు దోచేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది భారత దేశంలో అతిపెద్ది డిజిటల్ అరెస్ట్. ఈ డబ్బు విదేశాలకు వెళ్లినట్లు గుర్తించారు. అయితే రూ. 12.11 కోట్లను మాత్రం పోలీసులు సీజ్ చేశారు.
నా జీవితం మీ అందరికీ హెచ్చరిక
అయితే తాను దాచుకున్న డబ్బును ఇలా కొట్టేయడంపై నరేష్ మల్హాత్రా కన్నీటి పర్యంతమవుతున్నారు. తనకు ఈ వయసులో ఇలా జరగడం నిజంగా దురదృష్టమేనని, ఇది మిగతా అందరికీ ఒక హెచ్చరిక, మేలుకొలుపు అవుతుందన్నారు. తాను డిజిటల్ అరెస్ట్ మోసగాళ్‌లను నమ్మిన కారణంగానే ఇలా జరిగిందని, ఎవరూ కూడా తనలా మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు నరేష్ మల్హాత్రా.