న్యూఢిల్లీ: కేవలం రూ.500 ఖరీదు చేసే గడియారంపై ఇరుగుపొరుగు కుటుంబాల మధ్య 30 ఏళ్ల క్రితం చిన్న ఘర్షణగా మొదలైన క్రిమినల్ కేసును సుప్రీంకోర్టు ఎట్టకేలకు పరిష్కరించింది. ముగ్గురు నిందితులపై ఐపీసీ–304 ప్రకారం నమోదైన కేసును జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ అరుణ్ పల్లి ధర్మాసనం మూసివేసింది. ముగ్గురు నిందితులకు గాను కేసు పెండింగ్‌లో ఉండగానే ఇద్దరు చనిపోగా, మరొకరి వయస్సు 60 ఏళ్లు పైమాటేనని ధర్మాసనం పేర్కొంది.
1997లో పదమ్ సింగ్ అనే వ్యక్తి తన చేతి గడియారాన్ని పొరుగింట్లో ఉండే మనువాకు రూ.500కు విక్రయించాడు. అయితే, ఆ వాచీ తనకు నచ్చలేదంటూ తిరిగి ఇచ్చేందుకు మనువా ప్రయత్నించడం, ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. రాము, మధు అనే వారు మనువాతో కలిసి సింగ్‌పై దాడికి యత్నించారు. సింగ్‌ను వారు నీళ్లు లేని కాల్వలోకి తోసేశారు. అతడిని మధు రాయితో కొట్టినట్లు కూడా ఆరోపణలున్నాయి.
కాల్వలోని రాయిపై పడటంతో తీవ్రంగా గాయాలైన సింగ్ డెహ్రాడూన్‌లోని ఆస్పత్రిలో చనిపోయాడు. దీంతో ముగ్గురిపైనా కేసు నమోదైంది. 2002లో కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు కూడా ఈ శిక్షను సమరి్థంచింది. నిందితులు న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిందితుల్లో ప్రస్తుతం మధు మాత్రమే సజీవంగా ఉన్నాడు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఘటన సమయంలో పిటిషనర్‌కు 33 ఏళ్లు ఉంటాయి. ఇప్పటికి దాదాపు మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. ప్రస్తుతం అతడికి 60 ఏళ్లుండొచ్చు.
మృతుడు సింగ్, నిందితుడు మధు మధ్య వివాదం కొట్టుకునే స్థాయికి దారితీసింది. సింగ్ మరణానికి కాలువలో పడటం వల్ల తగిలిన గాయాలేనని నివేదిక తెలుపుతోంది’అని ధర్మాసనం పేర్కొంది. నిందితుడైన మథు ఇప్పటికే ఏడాదిన్నర పాటు జైలు శిక్ష అనుభవించాడని తెలిపింది. ఇంత సుదీర్ఘ కాలం తర్వాత నిందితుడిపై ఉన్న నేర నిర్ధారణను కొనసాగిస్తూనే, అతడికి విధించిన ఐదేళ్ల కఠిన కారాగార శిక్షను ఇప్పటికే అనుభవించిన శిక్షా కాలానికి పరిమితం చేస్తే సరిపోతుందని భావిస్తున్నాం’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


