కిలోమీటర్ పరిధిలో మైనింగ్‌పై నిషేధం
రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న టైగర్ రిజర్వుల పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. టైగర్ రిజర్వుల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సున్నిత పర్యావరణ జోన్లు(ఈఎస్‌జెడ్)లుగా ప్రకటించాలని, బఫర్ జోన్‌లలో కిలోమీటర్ పరిధిలో మైనింగ్ కార్యకలాపాలపై పూర్తి నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.ఏడాదిలోగా వీటిని అమలు చేయాలని స్పష్టం చేసింది. జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వులో అక్రమంగా చెట్ల నరికివేత, నిర్మాణ పనుల కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఉత్తరఖాండ్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ధర్మాసనం 80 పేజీల తీర్పు వెలువరించింది.
జిమ్ కార్బెట్‌కు తీవ్ర నష్టం
టైగర్ రిజర్వుల్లో పర్యావరణ ఉల్లంఘనలు, నష్టం తీవ్రత, పునరుద్ధరణ చర్యలతోపాటు ప్రఖ్యాత జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వులో జరిగిన విధ్వంసానికి బాధ్యులైన అధికారుల గుర్తింపు తదితరాలపై 2024 మార్చిలో నియమించిన నిపుణుల కమిటీ తాజాగా ఇచి్చన నివేదికను ధర్మాసనం ఆమోదించింది.కార్బెట్ టైగర్ రిజర్వులో సుమారు రూ.30 కోట్ల మేర విధ్వంసం జరిగినట్లు కమిటీ అంచనా వేసిందని ధర్మాసనం పేర్కొంది.
దెబ్బతిన్న పర్యావరణ వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించేందుకు రూ.4.3 కోట్ల వరకు ఖర్చవుతుందని తేలి్చనట్లు కూడా ధర్మాసనం తెలిపింది. ఈ నివేదిక సూచనల మేరకు జిమ్‌కార్బెట్ టైగర్ రిజర్వు పునరుద్ధరణ కోసం చేపట్టాల్సిన చర్యలపై రెండు నెలల్లోగా ఒక ప్రణాళికను రూపొందించాలని ఉత్తరాఖండ్ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌ను ధర్మాసనం ఆదేశించింది. నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొన్న అనధికారి నిర్మాణాలను మూడు నెలల్లోగా కూల్చి వేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తమ తీర్పు మేరకు అమలు చేసిన చర్యలతో ఏడాదిలోగా అఫిడవిట్ దాఖలు చేయాలంది.


