ఢిల్లీ: జాతీయ రహదారులలో రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అనుమతి లేని దాబాలు, రోడ్డు నిర్వహణ సరిగ్గా లేకపోవడం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లలోని జాతీయ రహదారులపై ఇటీవల చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టింది. ఈ రెండు రాష్ట్రాల హైవేల ప్రమాద ఘటనలపై నివేదిక సమర్పించాలని ఎన్‌హెచ్‌ఏఐ, కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది. రహదారులపై అనుమతి లేకుండా ఎన్ని దాబాలు ఉన్నాయో సర్వే చేయాలని, రోడ్డు కండీషన్స్ పైన నివేదిక ఇవ్వాలని కోరింది.
మెయింటెనెన్స్ సమయంలో కాంట్రాక్టర్లు తగిన ప్రమాణాలు పాటించారో లేదో వెల్లడించాలని ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయీ ధర్మాసనం ఆదేశించింది. జాతీయ రహదారుల పక్కన దాబాల ఏర్పాటు ప్రమాదాలకు కారణం అవుతున్నదని, ట్రక్కులను రోడ్డుపై ఆపేసి, దాబాలకు వెళ్తున్నారని తెలిపింది. ఆగిన వాహనాలను ఢీకొన్న కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది. దీనిని నిరోధించడం అవసరమని సూచించింది. టోల్ చార్జీలు వసూలు చేస్తున్నా రోడ్లు సరిగా ఉండడం లేదని పేర్కొంది. కాగా రాజస్థాన్‌లోని ఫాలోడీలో ఇటీవల జరిగిన ప్రమాదంలో 18 మంది, శ్రీకాకుళంలో ఈమధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు.


