మత్తు ముఠాలపై యుద్ధమే | States to conduct ruthless crackdown on drug traffickers Says Amit Shah | Sakshi
Sakshi News home page

మత్తు ముఠాలపై యుద్ధమే

Jun 27 2026 5:11 AM | Updated on Jun 27 2026 5:11 AM

States to conduct ruthless crackdown on drug traffickers Says Amit Shah

కొత్తగా మూడేళ్ల రోడ్‌మ్యాప్‌  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటన  

ఢిల్లీలో నార్కో–కోఆర్డినేషన్‌ సెంటర్‌ సదస్సు  

డ్రగ్‌ కంట్రోల్‌ విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల  

న్యూఢిల్లీ:  దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హెచ్చరించారు. డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో సహా నిర్మూలించడమే లక్ష్యంగా కఠినమైన అణచివేత చర్యలు, చట్టాల అమలు, ఆర్థికపరమైన దర్యాప్తులతో కూడిన నూతన మూడేళ్ల రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన నార్కో–కోఆర్డినేషన్‌ సెంటర్‌(ఎన్‌కార్డ్‌) సదస్సుకు అమిత్‌ షా నేతృత్వం వహించారు.

 డ్రగ్‌ కంట్రోల్‌(2026–2029) విజన్‌ డాక్యుమెంట్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో వార్షిక నివేదిక–2025ను సైతం విడుదల చేశారు. జమ్మూ, గౌహతిలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో జోనల్‌ కార్యాలయాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. 

సింథటిక్‌ డ్రగ్స్, డార్క్‌నెట్‌ ఆధారిత అక్రమ రవాణా, సరిహద్దుల గుండా జరిగే స్మగ్లింగ్, డ్రగ్స్‌ విషయంలో కొత్తగా తలెత్తుతున్న ముప్పులకు వ్యతిరేకంగా సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే ధ్యేయంగా విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు అమిత్‌ షా వెల్లడించారు.

 ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో.. రాబోయే మూడేళ్లలో మాదకద్రవ్యాల వ్యాపార వ్యవస్థను గట్టిగా దెబ్బకొడతామని, రాబోయే కొన్ని దశాబ్దాల పాటు అది కోలుకోలేదని తేల్చిచెప్పారు. మాదకద్రవ్యాల ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి ‘’గుర్తించడం, అడ్డుకోవడం, నాశనం చేయడం’అనే వ్యూహాన్ని అమలు చేయాలని డ్రగ్స్‌ నిరోధక సంస్థల అధికారులకు సూచించారు.  

సూత్రధారులు తప్పించుకోవడానికి వీల్లేదు  
డ్రగ్స్‌ను కట్టడి చేసే విషయంలో మానవ, సాంకేతిక నిఘా సమాచారాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలని అమిత్‌ షా చెప్పారు. దేశంలోకి డ్రగ్స్‌ణు తీసుకొచ్చేవారు, సరిహద్దుల నుండి వివిధ రాష్ట్రాలకు వాటిని సరఫరా చేసేవారు, రాష్ట్రాల నుంచి వినియోగదారులకు పంపిణీ చేసేవారు... ఈ మూడు రకాల ముఠాలను అంతం చేసే దిశగా ముందుకు సాగాలని స్పష్టంచేశారు.

 ‘గుర్తించడం, అడ్డుకోవడం, నిర్మూలించడం’అనే వ్యూహం కింద.. మాదకద్రవ్యాల సరఫరా వ్యవస్థను ప్రారంభ దశలోనే లక్ష్యంగా చేసుకోవాలని అన్నారు. మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లను ఛేదించడానికి, నేరస్థుల ఆస్తులను జప్తు చేయడానికి మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేపట్టే ఆర్థిక దర్యాప్తులను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. నేరాలకు సూత్రధారులుగా ఉన్నవారు విచారణ నుంచి తప్పించుకోవడానికి వీల్లేదని, అందుకు అవసరమైన అధికారాలు ప్రస్తుత చట్టాల్లోనే ఉన్నాయని గుర్తుచేశారు. 

వ్యసన విముక్తి, పునరావాస కేంద్రాల ఏర్పాటుతో డ్రగ్స్‌కు డిమాండ్‌ తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మనం ప్రస్తుతం ఒక కీలక మలుపు వద్ద ఉన్నామని చెప్పారు. మాదకద్రవ్యాల వ్యాపారం మనల్ని ఓడిస్తుందా లేక మనం దానిని ఓడిస్తామా? అనేది రాబోయే మూడేళ్లలో తేలిపోతుందని అమిత్‌ షా స్పష్టంచేశారు. రాబోయే వందేళ్లలో దేశ భవిష్యత్తు కోసం, ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలని, దృఢ సంకల్పం, సమిష్టి కృషితో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. మనం అత్యంత కఠినమైన వైఖరితో నెట్‌వర్క్‌–కేంద్రీకృత పోరాటాన్ని సాగించాలని, అప్పుడే ఈ సమస్యపై విజయం సాధించగలమని వెల్లడించారు.

బాధితుల పట్ల సానుభూతి చూపాలి  
డ్రగ్స్‌ అక్రమ రవాణాలో పాలుపంచుకునే వారి పట్ల కఠిన వైఖరిని, డ్రగ్స్‌ బాధితుల పట్ల సానుభూతి వైఖరిని కొనసాగించాలని అమిత్‌ షా సూచించారు. కరుణ, సద్భావన బాధితులను తిరిగి సాధారణ జీవితంతో మమేకం చేయగలవని వివరించారు. వారిని సరైన మార్గంలోకి నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. మత్తు పదార్థాలపై పోరాటాన్ని ఏ ఒక్క శాఖ, రాష్ట్రం, ప్రభుత్వం లేదా వ్యక్తి మాత్రమే నిర్వహించలేరని తెలియజేశారు. అన్ని రాష్ట్రాలు, శాఖలు ఒకేవేదికపైకి రావాలని పేర్కొన్నారు. 

నార్కో సిండికేట్లు వాడుకుంటున్న లొసుగులను అరికట్టడానికి నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌(ఎన్‌డీపీఎస్‌) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షిస్తోందని వెల్లడించారు. 2004 నుంచి 2014 మధ్య కాలంలో 26 లక్షల కిలోల సింథటిక్‌ డ్రగ్స్‌ను స్వా«దీనం చేసుకున్నామని, 2014 నుంచి 2026 వరకు 1.18 కోట్ల కిలోల సింథటిక్‌ డ్రగ్స్‌ను స్వా«దీనం చేసుకున్నామని చెప్పారు. మాదక ద్రవ్యాలపై మనం పోరాటం విజయ దిశగా స్థిరంగా సాగుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అమిత్‌ షా తేల్చిచెప్పారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement