పాలస్తీనాకు కాంగ్రెస్‌ సపోర్ట్‌.. సోషల్‌ మీడియాలో పొలిటికల్‌ వార్‌ | Sakshi
Sakshi News home page

పాలస్తీనాకు సపోర్టు ఇచ్చిన CWC.. సోషల్‌ మీడియాలో పొలిటికల్‌ వార్‌

Published Tue, Oct 10 2023 12:27 PM

Social Media War Between Congress And BJP Over Palestine - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇజ్రాయెల్‌లో భీకర యుద్ధం నడుస్తోంది. పాలస్తీనా, హమాస్‌ మిలిటెంట్లు.. ఇజ్రాయెల్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ సైతం.. గాజాపై ఎదురుదాడికి దిగింది. ప్రతిదాడులు చేస్తూ మిలిటెంట్లను తరమికొడుతోంది. మరోవైపు.. భారత్‌ సహా కొన్ని దేశాలు ఇజ్రాయెల్‌కు తమ మద్దతు ప్రకటించాయి. ఇక, భారత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సీడబ్ల్యూసీ పాలస్తీనాకు మద్దతు ప్రకటించడం చర్చనీయాశంగా మారింది. దీంతో.. కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య సోషల్‌ మీడియా(ట్విట్టర్‌) వేదికగా మాటల పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది.  

అయితే, ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ పాలస్తీనీయులకు మద్దతుగా తీర్మానం చేసింది. దీంతో, కాంగ్రెస్‌ పార్టీపై ట్విట్టర్‌ వేదికగా విమర్శల పర్వం మొదలైంది. కాంగ్రెస్‌ ఉగ్రవాదులకు ఊతమిస్తోందని, వారికి మద్దతుగా నిలుస్తోందని పలువురు ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ మద్దతుదారులు ఈ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ బెంగళూరు పార్లమెంటు సభ్యుడు, బీజేపీ యువ నేత తేజస్వీ సూర్య చేసిన ట్వీట్‌ తాజాగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. 

సోషల్‌ మీడియా వార్‌..
కాగా, తేజస్వీ సూర్య ట్విట్టర్‌ వేదికగా.. ‘ఇజ్రాయెల్‌ ముద్ధంపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానం.. మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు చక్కటి ఉదాహరణ. కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ ఓట్ల కోసం దేశ విదేశాంగ విధానాన్ని తాకట్టు పెట్టేసింది. మోదీ రాకతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది’ అని కామెంట్స్‌ చేశారు. దీనికి కాంగ్రెస్‌ కౌంటరిచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతకం చేసిన పాత లేఖ ఒకదాన్ని కాంగ్రెస్‌ నేతలు బయటపెట్టారు. గత ఏడాది నవంబరు 22న రాసిన ఈ లేఖ పాలస్తీనీయులను ఉద్దేశించింది కావడం గమనార్హం. 

ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ సాలిడారిటీ విత్‌ ద పీపుల్‌ ఆఫ్‌ పాలస్తీనా సందర్భంగా రాసిన ఈ లేఖలో పాలస్తీనా కారణానికి భారత్‌ గట్టిగా మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుహృద్భావ సంబంధాలను ఈ లేఖలో ప్రస్తావించారు. పాలస్తీనా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి భారత్‌ చేస్తున్న సాయాన్ని ప్రస్తావించారు. అయితే.. తాజాగా పాలస్తీనా, ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం మొదలైన సందర్భంగా మోదీ.. ఇజ్రాయెల్‌కు మద్దతు పలకడం విశేషం. హమాస్‌ జరిపిన ఆకస్మిక దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దీంతో, బీజేపీ డబుల్‌ గేమ్‌ విధానాలను కాంగ్రెస్‌ ఎత్తిచూపుతూ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement