
బీజేపీపై సోనియా గాంధీ తీవ్ర విమర్శ
న్యూఢిల్లీ: మోదీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై అగ్రనాయకురాలు సోనియాగాంధీ విమర్శల నిప్పులు గుమ్మరించారు. గణతంత్ర రాజ్యంగా వెలుగొందుతున్న భారత్‌లో రాజ్యాంగాన్ని బందీచేసి, మతసిద్దాంతాలతో దేశాన్ని మతరాజ్యంగా మార్చే కుట్రకు బీజేపీ పాలకులు తెగించారని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.
శనివారం ఢిల్లీలో జరిగిన ‘‘రాజ్యాంగం ఎదుర్కొంటున్న పెను సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు’’సదస్సులో ప్రసంగిస్తూ బీజేపీపై సోనియా పలు విమర్శలు చేశారు. ‘‘బీజేపీ దేశ రాజ్యాంగాన్ని తక్కువ చేసేందుకు చేసిన ప్రతి ప్రయత్నాన్ని పార్లమెంట్‌లో, కోర్టుల్లో, వీధుల్లో ప్రతి వేదికపై రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడింది. ఇది కేవలం రాజకీయపరమైన పోరాటం కాదు ప్రతి ఒక్క భారతీయుడి గౌరవానికి సంబంధించిన కీలకాంశం.
బీజేపీ పాలనలో ఇప్పుడు రాజ్యాంగం బందీఖానాలో బంధింపబడింది. స్వతంత్రభారతం కోసం ఏ ఒక్కరోజూ పోరాటం చేయని బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ ద్వయం ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా రాజ్యాంగ మూలసూత్రాలను సర్వనాశనం చేసేందుకు అధికారాన్ని దురి్వనియోగం చేస్తున్నాయి. బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ నమ్మే మనుస్మృతి మన త్రివర్ణపతాకాన్ని తిరస్కరించింది. వాళ్లు కేవలం హిందూ దేశాన్ని కోరుకుంటున్నారు. మత రాజ్యంలో ప్రజాస్వామ్యం మిథ్యగా, చట్టాలు చట్టబండలుగా మిగిలిపోతాయి.
బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ అస్తవ్యస్తం చేశారు. అసమ్మతి తెలిపితే వాళ్లపై నేరాలుమోపారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నారు. దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, పేద శ్రామికులను మోసగించారు. పౌరసత్వంలో సమానత్వానికి బాటలుపరచాలని ఆశించిన మహోన్నత నేత అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తూ రాజ్యాంగంలో చేర్చిన సామ్యవాదం, లౌకికవాదంపదాలనుసైతం పెకిలించివేయాలని బీజేపీ పాలకులు తెగ ఆరాటపడుతున్నారు. ఇలాంటి చర్యలు సంస్కరణలు అనిపించుకోవు. ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని శక్తివంతమైన వ్యక్తుల చెప్పుచేతల్లో నడిచే మతరాజ్యంగా మార్చేందుకు కుట్ర పన్నారు’’అని సోనియా వ్యాఖ్యానించారు.