
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పీఠాన్ని వదులుకునేందుకు మోదీ సిద్ధంగా లేరని, ఆయన్ని గద్దె దించాలని సంఘ్ పరివార్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారాయన. శనివారం ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ న్యాయ సదస్సులో రేవంత్ మాట్లాడుతూ..
‘‘తెలంగాణలో కుల గణన పూర్తి చేశాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. సామాజిక న్యాయంలో భాగంగా రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం కాంగ్రెస్ పార్టీది. 2004, 2009 లో ప్రధాని అయ్యే అవకాశం ఉన్న రాహుల్ గాంధీ తీసుకోలేదు. సీనియర్లకు ప్రధాని పదవి అప్పగించారు. కానీ..
..2001 నుంచి నరేంద్ర మోదీ అధికార కుర్చీని వీడడం లేదు. ఆర్‌ఎస్‌ఎస్ ఆ కుర్చీని వదిలేయాలని చెప్పినా కూడా మోదీ వదలడం లేదు. 75 ఏళ్ల వయసు వచ్చిన వారు పదవి దిగిపోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్లకు వర్తించిన వయస్సు పరిమితి అంశం.. మోదీకి వర్తించదా?..
.. మోదీని గద్దె నుంచి దించేందుకు సంఘ్ పరివార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ఆయన అందుకు సిద్ధంగా లేరు. మోదీని దించేయడం సంఘ్ పరివార్ వల్ల కాదు. మోదీని గద్దె దింపడం కేవలం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వల్లే అవుతుంది. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో మోడీని గద్దె దింపుతాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లకు మించి గెలవదు. మోదీ బారి నుంచి దేశాన్ని రక్షిస్తాం. దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు’’ అని రేవంత్ అన్నారు.