
న్యూఢిల్లీ: ఓట్ల చోరీ విషయంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమైన ఇండియా కూటమి.. మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ Gyanesh Kumarపై అభిశంసనకు నోటీసులు ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తాజాగా.. ఓట్ల చోరీ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని, లేకుంటే దేశానికి క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీకి సీఈసీ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే.
లోక్‌సభ ఎన్నికలు, తదనంతరం జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో.. ఓట్ల దొంగతనం జరిగిందని, లక్షల కొద్దీ ఓట్ల తొలగింపు ద్వారా బీహార్‌లోనూ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో.. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఘాటుగానే బదులిస్తోంది. తాజాగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి మరీ విపక్షాల ఆరోపణలను తిప్పి కొట్టారు.
వారం రోజుల్లో ఆరోపణలపై అఫిడవిట్‌ను సమర్పించాలని, లేకపోతే ఆరోపణలకుగానే పరిగణించి తదుపరి చర్యలకు వెళ్తామని.. లేకుంటే దేశానికి క్షమాపణలు చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అన్నారు.
అయితే సోమవారం పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు.. సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఉపరాష్ట్రపతి అభ్యర్థి గురించి చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు మల్లికార్జున ఖర్గే ఆఫీస్‌లో భేటీ అయ్యారు. ఈ క్రమంలో సీఈసీపై అభిశంసన అంశం ప్రస్తావనకు వచ్చినట్లు పలు జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇచ్చాయి. అయితే..
ఈ భేటీ అనంతరం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భేటీలో అలాంటిదేం ప్రస్తావనకు రాలేదన్నారు. ఒకవేళ అలాంటి అవసరమే పడితే.. కచ్చితంగా చేస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా మాకున్న అన్ని ఆయుధాలను ప్రయోగిస్తాం’’ అని స్పష్టత ఇచ్చారాయాన.
#WATCH | Delhi: On being asked if the Opposition parties are going to bring an impeachment motion against CEC Gyanesh Kumar, Congress Rajya Sabha MP Syed Naseer Hussain says, "If there is a need, we will use all the weapons of democracy under the rules. We have not had any… pic.twitter.com/ekySEeku5g
— ANI (@ANI) August 18, 2025
ఇదిలా ఉంటే.. సీఈసీ అనే రాజ్యాంగ హోదా ప్రతిష్టను జ్ఞానేష్ కుమార్ దిగజారుస్తున్నాడనంటూ విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఇవాళ ఆందోళనకు దిగాయి. బీజేపీకి సీఈసీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తక్షణమే ఆయన రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. దీంతో.. ఇండియా కూటమి సీఈసీపై అభిశంసన నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లే కనిపిస్తోంది.