
ఢిల్లీ బీహార్‌లో 65 లక్షల ఓటర్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ)పై ఇండియా కూటమి విమర్శలు గుప్పించింది. బీహార్ రాష్ట్రానికి సంబంధించి తొలగించిన 65 లక్షల ఓటర్లపై సీఈసీ స్పష్టత ఇవ్వలేదని మండిపడింది. సుప్రీంకోర్టు ఆదేశాలపై కూడా సీఈసీ వివరణ ఇవ్వలేకపోయిందని ఇండియా కూటమి ధ్వజమెత్తింది.
మహాదేవపుర ఓటరు మోసంపై సీఈసీ సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై సైతం సీఈసీ తప్పించుకుందని ఇండియా కూటమి విమర్శించింది. ఓటరు మోసాలపై దర్యాప్తు చేయలేదని, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడంలో ఈసీ విఫలమైందని, అధికార పార్టీని ప్రశ్నించే వాళ్లను ఈసీ బెదిరిస్తోందని ఇండియా కూటమి ఆరోపించింది.
కాగా, దేశవ్యాప్తంగా పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో లక్షలాది ఓట్లను తొలగించి పరోక్షంగా ఓటుహక్కును అపహరించారన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపణలను సీఈసీ ఖండించింది. ఈ మేరకు ఆదివారం(ఆగస్టు 17వ తేదీ) ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ మాట్లాడుతూ.. రాహుల్ చేసిన ఆరోపణల మేరకు ఓటు చోరీపై ఏడు రోజుల్లో సమగ్ర అఫిడవిట్ సమర్పించాలన్నారు.
లేని పక్షంలో దేశప్రజలకు తక్షణం క్షమాపణ చెప్పాలి’’ అని ప్రెస్ మీట్‌లో డిమాండ్ చేశారు. ‘‘ఓటు చోరీ ఆరోపణలు చేస్తున్న వారికి ఏడు రోజుల గడువిస్తున్నా. వారి ఆరోపణలపై ఆలోపు ప్రమాణపత్రం సమరి్పంచాలి. లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పడం మినహా మరో దారి లేదు. ఎలాంటి రుజువులూ లేకుండా మీరు చేస్తున్న ఈ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు. అబద్ధాలతో కొన్ని పార్టీలు ఈసీ భుజాల మీదుగా ఓటర్లకు తుపాకీ గురి పెడుతున్నాయి. ’’ అన్నారు.
అదే సమయంలో కేంద్రం ఎన్నికల సంఘం బాగోతం దేశ ప్రజలందరికీ తెలిసిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. అధికార బీజేపీతో చేతులు కలిపి ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) పేరిట గోల్‌మాల్‌కు తెరతీశారన్నారు.
అనుకూలురైన వ్యక్తులను ఓటర్ల జాబితాలో చేర్చి, వ్యతిరేకుల పేర్లు తొలగించి ఎన్నికల్లో నెగ్గేలా పెద్ద కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘ఈసీ–బీజేపీ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వబోం. ఎన్నికల చోరీని బిహార్ ప్రజలు సహించబోరు. పేదల ఓటు హక్కును కాపాడి తీరతాం’’ అన్నారు. బిహార్‌లోని సాసారాంలో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఓటర్ అధికార్ యాత్ర’ను రాహుల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.