
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేశారు. ఎక్స్ వేదికగా ఈసీకి ఐదు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సంఘం బీజేపీతో చేతులు కలిపి, దేశంలో ఎన్నికలను ప్రభావితం చేస్తోందంటూ నిన్న (గురువారం) సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి మేలు చేయడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పని చేస్తోందంటూ.. ఆధారాలతో సహా బయటపెట్టారు. ఓటర్ల జాబితాల్లో విచ్చలవిడిగా నకిలీ ఓటర్లను చేరుస్తోందని ఆరోపించారు.
ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) ఐదు ప్రశ్నలతో ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. ‘‘డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు?. సీసీ టీవీ ఆధారాలు ఎందుకు నాశనమయ్యాయి?. నకిలీ ఓట్ల నమోదును ఎందుకు అడ్డుకోలేపోతున్నారు?. ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు?. బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్‌గా మారిందా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
चुनाव आयोग, 5 सवाल हैं - देश जवाब चाहता है:
1. विपक्ष को डिजिटल वोटर लिस्ट क्यों नहीं मिल रही? क्या छिपा रहे हो?
2. CCTV और वीडियो सबूत मिटाए जा रहे हैं - क्यों? किसके कहने पर?
3. फर्जी वोटिंग और वोटर लिस्ट में गड़बड़ी की गई - क्यों?
4. विपक्षी नेताओं को धमकाना, डराना - क्यों?… pic.twitter.com/P0Wf4nh5hc— Rahul Gandhi (@RahulGandhi) August 8, 2025
కాగా, ఇవాళ (శుక్రవారం) బెంగళూరులో ఓట్ అధికార్ ర్యాలీ పేరిట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఓటర్ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిందని, ఎన్నికల సంఘం రాజ్యాంగానికి గనుక కట్టుబడి ఉంటే తాము కోరిన వివరాలను అందించాలని రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో మా సర్వే ప్రకారం.. 15 నుంచి 16 సీట్లు గెలుస్తుందని అంచనా వేశాం. కానీ, 9 మాత్రమే గెలిచాం. ఆ ఫలితాలను విశ్లేషించినప్పుడు.. నిజంగానే మేం ఓడిపోయామా? అనిపించింది. వెంటనే ఓటర్ల సాఫ్ట్ కాపీని ఇవ్వమని ఈసీని కోరాం. కానీ, ఈసీ అందుకు నిరాకరించింది. ఎన్నికల వీడియోలు కావాలని కోరినా.. రూల్స్ మారిపోయాయంటూ ఇవ్వడానికి ఒప్పుకోలేదంటూ రాహుల్ చెప్పుకొచ్చారు.