
ఢిల్లీ: చర్రితలో నిలిచిపోయేలా ఆపరేషన్ సిందూర్ చేపట్టామని ఎయిర్‌ఫోర్స్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. 300 కి.మీ దూరంలోని లక్ష్యాలు ఛేదించామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై ఆసక్తికర విషయాలు బయపెట్టిన ఐఏఎఫ్ చీఫ్.. భారత యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయన్న పాకిస్తాన్ ఆర్మీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడం చరిత్రాత్మకమని.. ఆపరేషన్ సిందూర్ భవిష్యత్ పోరాటాలకు స్ఫూర్తినిస్తుందన్నారు.
‘‘ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌ను చావు దెబ్బ తీశాం. పాకిస్తాన్‌కు చెందిన 5 పైటర్ జెట్స్‌ను ధ్వంసం చేశాం. దెబ్బతిన్న పాక్ ఫైటర్ జెట్స్‌లో ఎఫ్-16 ఉన్నాయి. మన అమ్ములపొదిలోని అస్త్రాలన్నీ గేమ్ ఛేంజర్లే. ఆపరేషన్ సిందూర్ సమయంలో సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పాక్‌కు చెందిన అవాక్ విమానాన్ని ధ్వంసం చేశాం.
..మే 10న యుద్ధ విరామానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం కాదు.. పాకిస్తానే భారత్‌ను శాంతికి అభ్యర్థించిందని ఏపీ సింగ్ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, పాక్, ఆ దేశ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసింది’ అని ఐఏఎఫ్ చీఫ్ వెల్లడించారు.