
అనూప్‌గఢ్: త్వరలో ఆపరేషన్ సిందూర్ 2.0 ఉండబోతోందంటూ భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్‌లోని ఆర్మీ చెక్ పోస్ట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ను భూగోళంలో లేకుండా చేస్తామంటూ వ్యాఖ్యానించారు. త్వరలో ఆపరేషన్ సిందూర్ 2.0 ఉంటుందని.. సైన్యం సిద్ధంగా ఉండాలన్నారు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించారు.
‘‘ప్రపంచ మ్యాప్‌లో ఉండాలనుకుంటే ఉగ్రవాదాన్ని ఆపి తీరాల్సిందే.. లేదంటే చరిత్ర నుంచి తుడిచిపెట్టుకోవాల్సి వస్తుంది జాగ్రత్త’’ అని ఆర్మీ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సైన్యం పాక్‌తో చెస్ ఆడిందంటూ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ 1.0 సమయంలో న్యూఢిల్లీ చూపిన సహనం ఇకపై పునరావృతం కాదు. ఈసారి భారత్ పూర్తిగా సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండాలా వద్దా అనే విషయాన్ని ఆలోచించేలా చర్యలు తీసుకుంటాం’’ అని ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.
‘‘మీరు పూర్తిగా సిద్ధంగా ఉండండి. భగవంతుడు అనుకుంటే.. ఆ అవకాశం త్వరలోనే వస్తుంది’’ అంటూ సైనికులకు సూచించారు. ఏప్రిల్ 22న పహల్గాం దాడి అనంతరం ప్రారంభమైన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాల ఆధారాలను భారత్ ప్రపంచానికి చూపించింది. భారత్ ఆ ఆధారాలను బయటపెట్టకపోయుంటే, పాకిస్తాన్ వాటిని దాచేసేది
..ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పాకిస్తాన్‌లో తొమ్మిది లక్ష్యాలను దాడి చేసింది. వాటిలో ఏడును ఆర్మీ, రెండును ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది. "మేము లక్ష్యాలను గుర్తించాం ఎందుకంటే మేము కేవలం ఉగ్రవాదులను మాత్రమే నాశనం చేయాలనుకున్నాం’’ అని ఉపేంద్ర ద్వివేది చెప్పారు.