ఇజ్రాయెల్‌ వార్‌పై ఒవైసీ రియాక్షన్‌.. ఆయనో డెవిల్‌ అంటూ.. | MIM MP Asaduddin Owaisi Shocking Comments On Iarael War | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌-హమాస్‌ వార్‌.. వారందరికీ సెల్యూట్‌.. ఒవైసీ షాకింగ్‌ కామెంట్స్‌

Oct 15 2023 10:49 AM | Updated on Oct 15 2023 11:09 AM

MIM MP Asaduddin Owaisi Shocking Comments On Iarael War - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ దాడుల కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇలాంటి తరుణంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఇజ్రాయెల్‌ వార్‌పై ఘాటుగా స్పందించారు. తన మద్దతు పాలస్తీనాకు ఉంటుందని ఒవైసీ స్పష్టం చేశారు. 

కాగా, ఒవైసీ శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఒవైసీ మాట్లాడుతూ.. తాను పాలస్తీనా వైపే ఉంటానని తేల్చి చెప్పారు. గాజాలో ఇప్పటికీ పోరాడుతున్న వారికి లక్షలాదిమంది సెల్యూట్ చేస్తున్నారని అన్నారు. గాజాకు విద్యుత్‌, తాగునీటి సరఫరాను నిలిపివేయడంతో లక్షల మంది పౌరులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 21 లక్షల జనాభా ఉన్న గాజాలో 10 లక్షల మంది పేద ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయినా కూడా ప్రపంచం మౌనంగా ఉంది. 70 ఏళ్లుగా పాలస్తీనాలో ఇజ్రాయెల్ ఆక్రమణదారుగా ఉంది. అక్కడ దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇదే సమయంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహును దుష్టశక్తిగా(డెవిల్‌) అభివర్ణించారు. ఆయన క్రూరుడని, యుద్ధ నేరగాడని మండిపడ్డారు. పాలస్తీనా పేరెత్తితే కేసులు పెడతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హెచ్చరిండంపై ఒవైసీ ఘాటు విమర్శలు చేశారు. మన త్రివర్ణ పతాకంతోపాటు తాను పాలస్తీనా జెండాను కూడా గర్వంగా ధరిస్తానని పేర్కొన్నారు. తాను పాలస్తీనా పక్షానే ఉంటానని తేల్చి చెప్పారు. 

పాలస్తీనియన్లపై జరుగుతున్న అకృత్యాలను ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ విషయమై ప్రధాని మోదీ మానవత్వంతో స్పందించాలని కోరారు. పాలస్తీనా కేవలం ముస్లింలకు సంబంధించిన విషయం కాదని, ఇది మానవతా సమస్య అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పాలస్తీనాకు ఇప్పటికే కాంగ్రెస్‌ తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఇరు దేశాల మధ్య వెంటనే కాల్పుల విరమణ పాటించాలని నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పిలుపునిచ్చింది.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. లిస్ట్‌ ఇదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement