
ఈరోజు రక్షా బంధన్.. అక్కాచెల్లెళ్లు తమ అనుబంధానికి గుర్తుగా అన్నదమ్ములకు రాఖీ కడుతుంటారు. కొందరైతే ఈరోజున తమను వీడివెళ్లిన అన్నదమ్ములను అక్కాచెల్లెళ్లను గుర్తు చేసుకుంటారు. వారు తమతోపాటు ఉండి, తమకు రాఖీ కడితే ఎంతో ఆనందంగా ఉండేదని అనుకుంటారు. అయితే ఇటువంటి కల ‘శివమ్’ విషయంలో సాకారమయ్యింది. అతని గురించి తెలిసినవారంతా శివమ్‌ను మించిన అదృష్టవంతుడు లేడంటూ కొనియాడుతున్నారు.
గుజరాత్‌లోని వడోదరకు చెందిన 19 ఏళ్ల శివమ్ సోదరి రియా బాబీ మిస్త్రీ(9) 2024లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. అయితే ఆమె చేతిని అవయవమార్పిడి చికిత్స ద్వారా ముంబైకి చెందిన అనమ్తా అహ్మద్(14)కు అతికించారు. ఈ చిన్నారి విద్యుత్ షాక్ కారణంగా తన కుడిచేతిని కోల్పోయినది. అయితే శుక్రవారం శివమ్, అనమ్తా అహ్మద్ కుటుంబాలు భావోద్వేగంతో కూడిన రాఖీ సంబరాలు చేసుకున్నాయి. చనిపోయిన చిట్టి చెల్లి వడోదరకు వచ్చి శివమ్‌కు రాఖీ కట్టింది.
2022లో విద్యుత్ షాక్ కారణంగా తన కుడి చేయిని కోల్పోయిన ముంబైకి చెందిన అనమ్తా అహ్మద్ అవయవ మార్పిడి ద్వారా తిరిగి చేతిని పొందగలిగింది. అమెకు వడోదరకు చెందిన తొమ్మిదేళ్ల రియా బాబీ మిస్త్రీ చేతిని అతికించారు. రియా మెదడులో అకస్మాత్తుగా రక్తస్రావం కావడంతో వైద్యులు ఆ చిన్నారి బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. రాఖీ కట్టేందుకు తమ ఇంటికి వచ్చిన అనమ్తా అహ్మద్‌ను చూసిన శివమ్ పొంగిపోయాడు. మృతిచెందిన తన సోదరే తిరిగి తన దగ్గరకు వచ్చి రాఖీ కట్టిందని శివమ్ సంబరపడుతూ తెలిపాడు.