రష్యా సైన్యంలో భారత విద్యార్థి బందీ.. డ్రగ్స్ కేసుతో బ్లాక్‌మెయిల్ | Gujarat Student Forced To Join Russian Army | Sakshi
Sakshi News home page

రష్యా సైన్యంలో భారత విద్యార్థి బందీ.. డ్రగ్స్ కేసుతో బ్లాక్‌మెయిల్

Dec 22 2025 7:26 AM | Updated on Dec 22 2025 7:30 AM

Gujarat Student Forced To Join Russian Army

మాస్కో: చదువుకునేందుకు రష్యాకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు అక్కడ నరకం కనిపిస్తోంది. గుజరాత్‌లోని మోర్బికి చెందిన సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ అనే విద్యార్థి తనకు రష్యాలో ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. తనపై తప్పుడు డ్రగ్స్ కేసు మోపి, సైన్యంలో చేరకపోతే జైలుకు పంపుతామని అక్కడి పోలీసులు బ్లాక్‌మెయిల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

సాహిల్ మొహమ్మద్ హుస్సేన్‌కు కేవలం 15 రోజుల శిక్షణ ఇచ్చి, నేరుగా ఉక్రెయిన్ యుద్ధరంగంలోకి తరలించడంతో మరో గత్యంతరం లేక, ప్రాణభయంతో అతను ఉక్రెయిన్ సైన్యానికి లొంగిపోయాడు. ప్రస్తుతం అక్కడ బందీగా ఉన్న సాహిల్, ఒక వీడియో సందేశం పంపి ‘నన్ను కాపాడండి మోదీ’ అంటూ కన్నీరుమున్నీరవుతున్నాడు. కాగా ఈ ఘటనతో డ్రగ్స్ మాఫియా, రష్యన్ సైన్యం మధ్య జరుగుతున్న దారుణాలు బయటపడుతున్నాయి.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న భారతీయ యువకులను టార్గెట్ చేస్తూ, స్కామర్లు వారిపై తప్పుడు కేసులు మోపుతున్నారని, కనీసం 700 మంది భారతీయులను ఇలాగే జైలు పాలు చేసి, సైన్యంలో చేరితేనే విడుదల చేస్తామని వేధిస్తున్నారని సాహిల్ ఆ వీడియోలో వెల్లడించాడు. ఆలివ్ గ్రీన్ జాకెట్ ధరించి ఉక్రెయిన్ కస్టడీలో ఉన్న ఈ విద్యార్థి వీడియో చూస్తుంటే అక్కడి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థమవుతుంది.
 

ఈ హృదయ విదారక ఘటనపై భారత ప్రభుత్వం సీరియస్ అయింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మాట్లాడుతూ రష్యన్ సైన్యంలో చిక్కుకున్న భారతీయులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ప్రధాని  మోదీ స్వయంగా పుతిన్‌తో చర్చలు జరిపారని తెలిపారు. ఇప్పటికే చాలా మందిని రక్షించామని, మిగిలిన వారిని కూడా స్వదేశానికి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. సాహిల్ తల్లి కూడా తన కొడుకు కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, బిడ్డ క్షేమంగా తిరిగి రావాలని ఎదురుచూస్తున్నారు.

కాగా విదేశాలకు వెళ్లే యువతకు సాహిల్ ఇచ్చిన హెచ్చరిక ఇప్పుడు వైరల్ అవుతోంది. "రష్యాలో ఉద్యోగాల పేరుతో లేదా చదువు పేరుతో వస్తున్న వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ స్కామర్లు మిమ్మల్ని డ్రగ్స్ కేసుల్లో ఇరికించి, యుద్ధంలోకి నెట్టేస్తారు" అని అతను హెచ్చరించాడు. రష్యన్ సాయుధ దళాల్లో చేరమని వచ్చే ఎటువంటి ఆఫర్లను నమ్మవద్దని ప్రభుత్వం కూడా మరోసారి స్పష్టం చేసింది. 

ఇది కూడా చదవండి: అందుకే.. పట్టాలపై గజరాజుల మృత్యుఘోష!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement