ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధింపులపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా విధిస్తున్న సుంకాల వల్ల మన ప్రాంతీయ పోటీదారులతో పోలిస్తే భారత్ ఇప్పటికే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇదే సమయంలో అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందం విషయంలో ఆలస్యం చేయవద్దని శశిథరూర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
అమెరికా సుంకాలపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఈ సందర్బంగా శశిథరూర్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారని.. మళ్లీ ఇరాన్‌తో వ్యాపారం విషయంలో 25 శాతం సుంకాలు విధిస్తున్నారన్నారు. ఇన్ని టారిఫ్‌లను తట్టుకొని 75 శాతం సుంకాలతో అమెరికాకు మన ఉత్పత్తులను ఎగుమతి చేయడం సాధ్యమైనంత ఈజీ కాదు. భారీ నష్టాలు ఎదురవుతాయని హెచ్చరించారు.
ఇదే సమయంలో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అమెరికా రాయబారి సెర్గియో గోర్ సహకరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.


