
ముంబై: ఎయిరిండియా విమాన మృతుల కుటుంబాల కోసం టాటా సన్స్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. 260 మంది మృతుల కుటుంబాలకు సాయం చేసేందుకు ట్రస్ట్ AI171 మెమోరియల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటైంది. రూ.500 కోట్లతో ఈ ట్రస్ట్‌ను టాటా సన్స్ ఏర్పాటు చేసింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి వైద్య ఖర్చులకు వినియోగించనున్నారు.
ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌ను పునర్నిర్మాణానికి ఖర్చు చేయనున్నారు. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫైన 32 క్షణాల వ్యవధిలోనే రన్‌వేను ఆనుకుని ఉన్న వైద్య కళాశాల భవనాలపై కుప్పకూలడం, 241 మంది ప్రయాణికులతో సహా మొత్తం 260 మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. ప్రమాదం 32 సెకన్లలోపే జరిగిపోయింది.
ఉదయం 11.17: ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగిన ఎయిరిండియా విమానం.. మధ్యాహ్నం 1.38:39: రన్‌వే నంబర్ 23 నుంచి టేకాఫ్ అయ్యింది. మధ్యాహ్నం 1.38:42: టేకాఫై 180 నాట్ల ఐఏఎస్ వేగం అందుకున్న విమానం.. అదే సమయంలో రెండు ఇంధన నియంత్రణ స్విచ్‌లు ‘రన్’ పొజిషన్ నుంచి ‘కటాఫ్’కు మారాయి. 1.38:47: ఇంధన సరఫరా నిలిచిపోవడంతో రెండు ఇంజన్లూ విఫలమయ్యాయి. దాంతో విమానం పూర్తిగా గాల్లోకి లేచేందుకు కావాల్సిన మినిమం ఇడిల్ రేట్‌ను అందుకోలేదు. అందుకు కావాల్సిన హైడ్రాలిక్ పవర్ అందించేందుకు రామ్ ఎయిర్ టర్బైన్ (ఆర్‌ఏటీ) పంప్ క్రియాశీలమైంది.
1.38:52: ఒకటో ఇంజన్ స్విచ్ ఆన్ కాగా.. 1.38:54కి ఏపీయూ ఇన్‌లెట్ తలుపు తెరుచుకుంది. 1.38:56కి రెండో ఇంజన్ స్విచ్ ఆన్ అయ్యంది. 1.39:05కి పైలట్ ప్రమాద (మే డే) సందేశం పంపించారు. 1.39:11కి తుది డేటా నమోదైంది. ఏటీసీ స్పందించేలోపే జనసమ్మర్ధ ప్రాంతంలో నేలను తాకిన విమానం.. మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడి పేలిపోయింది.