breaking news
welfare trust
-
ఎయిరిండియా విమాన ప్రమాద బాధితుల కోసం రూ.500 కోట్లతో ట్రస్ట్
ముంబై: ఎయిరిండియా విమాన మృతుల కుటుంబాల కోసం టాటా సన్స్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. 260 మంది మృతుల కుటుంబాలకు సాయం చేసేందుకు ట్రస్ట్ AI171 మెమోరియల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటైంది. రూ.500 కోట్లతో ఈ ట్రస్ట్‌ను టాటా సన్స్ ఏర్పాటు చేసింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి వైద్య ఖర్చులకు వినియోగించనున్నారు.ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌ను పునర్నిర్మాణానికి ఖర్చు చేయనున్నారు. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫైన 32 క్షణాల వ్యవధిలోనే రన్‌వేను ఆనుకుని ఉన్న వైద్య కళాశాల భవనాలపై కుప్పకూలడం, 241 మంది ప్రయాణికులతో సహా మొత్తం 260 మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. ప్రమాదం 32 సెకన్లలోపే జరిగిపోయింది.ఉదయం 11.17: ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగిన ఎయిరిండియా విమానం.. మధ్యాహ్నం 1.38:39: రన్‌వే నంబర్ 23 నుంచి టేకాఫ్ అయ్యింది. మధ్యాహ్నం 1.38:42: టేకాఫై 180 నాట్ల ఐఏఎస్ వేగం అందుకున్న విమానం.. అదే సమయంలో రెండు ఇంధన నియంత్రణ స్విచ్‌లు ‘రన్’ పొజిషన్ నుంచి ‘కటాఫ్’కు మారాయి. 1.38:47: ఇంధన సరఫరా నిలిచిపోవడంతో రెండు ఇంజన్లూ విఫలమయ్యాయి. దాంతో విమానం పూర్తిగా గాల్లోకి లేచేందుకు కావాల్సిన మినిమం ఇడిల్ రేట్‌ను అందుకోలేదు. అందుకు కావాల్సిన హైడ్రాలిక్ పవర్ అందించేందుకు రామ్ ఎయిర్ టర్బైన్ (ఆర్ఏటీ) పంప్ క్రియాశీలమైంది.1.38:52: ఒకటో ఇంజన్ స్విచ్ ఆన్ కాగా.. 1.38:54కి ఏపీయూ ఇన్లెట్ తలుపు తెరుచుకుంది. 1.38:56కి రెండో ఇంజన్ స్విచ్ ఆన్ అయ్యంది. 1.39:05కి పైలట్ ప్రమాద (మే డే) సందేశం పంపించారు. 1.39:11కి తుది డేటా నమోదైంది. ఏటీసీ స్పందించేలోపే జనసమ్మర్ధ ప్రాంతంలో నేలను తాకిన విమానం.. మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడి పేలిపోయింది. -
పోరాట యోధుడు వంగరి నర్సయ్య కన్నుమూత
సిరిసిల్ల: నిజాం వ్యతిరేక పోరాటంలో ఉద్యమించిన సమరయోధుడు, సిరిసిల్ల పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షుడు వంగరి నర్సయ్య(102) గురువారం కన్నుమూశారు. సిరిసిల్ల పద్మశాలి సమాజానికి ఐదు దశాబ్దాల పాటు సేవలు అందించిన వంగరి నర్సయ్య పెద్దగా సుపరిచితులు. శతాధిక వృద్ధుడిగా గుర్తింపు పొందిన ఆయన అనారోగ్యంతో గత పక్షం రోజులుగా మంచం పట్టారు. సిరిసిల్ల నేతన్నల సంక్షేమం కోసం 2008లో సీఎం కేసీఆర్ రూ.50లక్షల నిధిని సమకూర్చగా.. ఆ నిధిని పేదలకు అందించే బాధ్యతను పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షుడిగా వంగరి నర్సయ్యకు అప్పగించారు. పేదలకు వడ్డీ లేని రుణాలు అందించి ట్రస్ట్‌ను సమర్థవంతంగా నడిపించడంలో నర్సయ్య ముందున్నారు. ఆయనకు ముగ్గురు కొడుకులు, నలుగురు కూమార్తెలు ఉన్నారు. వంగరి నర్సయ్య మృతి పట్ల వివిధ సంఘాల నాయకులు, పద్మశాలి సంఘం పెద్దలు సంతాపం తెలిపి, నర్సయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. -
ఏడేళ్ల నరకానికి విముక్తి...
రాజోలు: ఉపాధి కోసం కువైట్ వెళ్లిన మహిళ ఏడేళ్లపాటు నరకం చూసింది సఖినేటిపల్లి బళ్లపేటకు చెందిన నల్లి పద్మపాండే. ఎట్టకేలకు నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చొరవతో శనివారం భారత దేశానికి తిరిగి వచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పద్మను నేషనల్ వెల్ఫేర్ ట్రస్ట్ కో–ఆర్డినేటర్ లిస్సీ జోసఫ్ చొరవతీసుకొని ప్రత్యేక వాహనంలో స్వగ్రామం పంపించే ఏర్పాటు చేశారు. వివరాలిలా ఉన్నాయి...సఖినేటిపల్లి బళ్లపేటకు చెందిన బళ్ల పద్మపాండేకు మలికిపురం మండలం పడమటిపాలెం గ్రామానికి చెందిన నల్లి శ్రీనుతో వివాహమైంది. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ఉపాధి కోసం పద్మ కువైట్ వెళ్లింది. అంతే ఆమె జీవితంలో నరకం ప్రారంభమైంది. కువైట్ వెళ్లిన రెండేళ్లపాటు కుటుంబ సభ్యులతో ఫోన్, ఉత్తరాల ద్వారా ‘తాను చాలా ఇబ్బందులు పడుతున్నాని, ఇండియాకు వచ్చేస్తా’నని చెప్పేది. తరువాత ఫోన్ కాని, ఉత్తరం కాని ఆమె నుంచి రాకపోవడంతో చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. సుమారు ఆరు నెలల క్రితం కువైట్‌లో తీవ్ర కాలిన గాయాలు, దెబ్బలతో ఓ మహిళ రోడ్డు పక్కన పడి ఉండడాన్ని ఉపాధి కోసం వెళ్లిన తెలుగువారు గుర్తించారు. తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉంటారని ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. సోషల్ మీడియా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ చిత్రాన్ని సఖినేటిపల్లి మండలం బళ్లపేటలోని పద్మ మేనమామ నక్కా రామారావు గుర్తించారు. మేనకోడలను ఎలాగైనా స్వదేశానికి తీసుకుని రావాలని రాజోలులో ఉన్న నేషనల్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యుడు, న్యాయవాది నల్లి శంకర్‌ను సంప్రదించారు. కువైట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మను భార త రాయబార కార్యాలయం ద్వారా స్వగ్రామానికి తీసుకుని వచ్చేందుకు కృషి చేశారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావులు ఇచ్చిన సిఫార్సు లేఖలు ద్వారా ఎట్టకేలకు కువైట్ నుంచి హైదరాబాదు ... అక్కడ నుంచి గురువారం రాత్రి 10 గంటలకు స్వగ్రామానికి చేరుకోగలిగిందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అన్ని విధాలా నష్టపోయిన పద్మను ప్రభుత్వం ఆదుకోవాలని, ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. -
‘సంక్షేమ నిధి’ బాధ్యతలు స్వీకరించిన లోకేశ్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా నియమితులైన నారా లోకేశ్ గురువారం ఎన్టీఆర్ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా సంక్షేమ నిధిని వినియోగిస్తామన్నారు. సంక్షేమ నిధికి 14 కోట్లు నిధి రూపంలో వచ్చాయని, మరో ఆరు కోట్లు పార్టీపరంగా కేటాయించి 20 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని తెలిపారు.