కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేంటి? | SC to examine if farmers are evading satellite surveillance to burn stubble | Sakshi
Sakshi News home page

కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేంటి?

Nov 13 2025 6:36 AM | Updated on Nov 13 2025 6:36 AM

SC to examine if farmers are evading satellite surveillance to burn stubble

పంజాబ్, హరియాణా సర్కార్‌లను ఆదేశించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాల తగలబెట్టడం సైతం ప్రధాన కారణమంటూ ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పొలాల్లో వ్యర్థాలను తగలబెట్టకుండా, పరిస్థితిని నియంత్రించడానికి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆయా రాష్ట్రాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్, జస్టిస్‌ ఎన్వీ అంజారియాల ధర్మాసనం ఆదేశించింది. కోర్టు సహాయకురాలు(అమికస్‌ క్యూరీ)గా వ్యవహరిస్తున్న సీనియర్‌ మహిళా అపరాజితా సింగ్‌ కోర్టు ఎదుట పలు అంశాలను ప్రస్తావించారు.

 ‘‘పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాల దహనాలు ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయిలను మరింత దిగజార్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని స్వయంగా నాసా వారి ఉపగ్రహ చిత్రాలు సైతం రుజువుచేస్తున్నాయి. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రాలు పెడచెవిన పెట్టాయి. ఇప్పుడైనా రాష్ట్రాలు ఏపాటి చర్యలు తీసుకుంటాయో చూద్దాం’’ అని ఆమె అన్నారు. ‘పంట వ్యర్థాలను తగలబెట్టకుండా నియంత్రించడానికి తీసుకున్న చర్యలేంటో రాష్ట్రాలు స్పష్టంచేయాలి’ అని జస్టిస్‌ గవాయ్‌ ఆదేశించారు. కాలుష్యనియంత్రణ మాత్రమేకాదు నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించి ఆదేశాలిస్తామని సీజేఐ అన్నారు. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్‌ 17వ తేదీన చేపట్టనున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement