ఔరంగజేబ్‌ను పొగిడిన ఎస్‌పీ ఎమ్మెల్యే సస్పెన్షన్‌ | Samajwadi Party MLA Abu Azmi suspended from Maharashtra Assembly | Sakshi
Sakshi News home page

ఔరంగజేబ్‌ను పొగిడిన ఎస్‌పీ ఎమ్మెల్యే సస్పెన్షన్‌

Mar 6 2025 4:03 AM | Updated on Mar 6 2025 4:03 AM

Samajwadi Party MLA Abu Azmi suspended from Maharashtra Assembly

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో మొఘల్‌ చక్రవరి ఔరంగజేబ్‌పై పొగడ్తలు కురిపించిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) అబూ ఆసిమ్‌ అజ్మీపై సస్పెన్షన్‌ వేటుపడింది. ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగే ప్రస్తుత బడ్జెట్ సమావేశాల నుంచి ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు బుధవారం స్పీకర్‌ ప్రకటించారు. ఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన అజ్మీ మంగళవారం..‘ఔరంగజేబ్‌ హయాంలో భారతదేశ సరిహద్దులు అఫ్గానిస్తాన్, మయన్మార్‌ వరకు విస్తరించాయి. అప్పట్లో ప్రపంచ జీడీపీలో మన జీడీపీ వాటా 24 శాతం వరకు ఉంది. అది భారత్‌కు స్వర్ణయుగమైంది’అని పేర్కొన్నారు.

 ఔరంగజేబ్, ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ మధ్య జరిగిన యుద్ధాన్ని ఆయన రాజకీయ పోరాటంగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై ఉభయసభలు దద్దరిల్లాయి. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే తీవ్రంగా స్పందించారు. ‘అజ్మీ ఉద్దేశ పూర్వకంగానే శివాజీని, సంభాజీని అవమానించారు. ఔరంగజేబ్‌ను పొగిడారు. అటువంటి అజ్మీ ద్రోహి, అసెంబ్లీలో కూర్చునే అర్హత ఆయనకు లేదు’అని నిప్పులు చెరిగారు. ‘ఔరంగజేబ్‌ క్రూరమైన చర్యలను ఎదుర్కొంటూ సంభాజీ ప్రదర్శించిన ధైర్యసాహసాలను వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 

మతం మార్చుకోవాలంటూ సంభాజీని ఔరంగజేబ్‌ 40 రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. అతడు హిందువులను మాత్రమే కాదు, ఇతర మతస్తులను సైతం చంపించాడు’అని చెప్పారు. ఔరంగజేబ్‌ను పొగడటం అంటే ఛత్రపతి శివాజీని, ఆయన కుమారుడు సంభాజీని అవమానించడమేనని సభ్యులు ఆరోపించారు. అజ్మీని సస్పెండ్‌ చేసి, దేశ ద్రోహం కింద కేసు నమోదు చేయాలని అధికార పక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. అజ్మీని మిగతా కాలం సమావేశాల నుంచి సస్పెండ్‌ చేయాలంటూ బుధవారం మంత్రి చంద్రకాంత్‌ పాటిల్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

నా వ్యాఖ్యలను వక్రీకరించారు: అజ్మీ
‘ఔరంగజేబ్‌ను గురించి నేను చెప్పిన విషయాలన్నీ చరిత్రకారులు, వివిధ రచయితలు పేర్కొన్నవే. శివాజీ, సంభాజీకి ఇతర మహనీయులకు వ్యతిరేకంగా నేనెలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. అయినప్ప టికీ, నా వ్యాఖ్యలు ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటాను’అని పేర్కొంటూ అజ్మీ ఓ వీడియో విడుదల చేశారు. తను పేర్కొన్న విషయాల్లో ఎలాంటి తప్పు లేకున్నా వాటిని వక్రీకరించారని ఆరోపించారు. ‘సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించరాదనే ఉద్దే శంతో అసెంబ్లీ వెలుపల మాట్లాడానని, అయినప్ప టికీ తనను సస్పెండ్‌ చేశారు’అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అజ్మీని మా దగ్గరికి పంపించండి: యూపీ సీఎం యోగి
‘ఔరంగజేబ్‌ను ప్రశంసించిన ఎస్‌పీ ఎమ్మె ల్యే అజ్మీని ఉత్తరప్రదేశ్‌కు పంపించండి. ఇటు వంటి వాళ్లని ఏం చేయాలో మా రాష్ట్ర ప్రజలకు తెలుసు’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొ న్నారు. ఔరంగజేబ్‌ని హీరో అంటూ పొగిడిన అజ్మీకి దేశంలో ఉండే అర్హతుందా అని ప్రశ్నించారు. అజ్మీ వ్యాఖ్య లపై వైఖరిని వెల్లడించాలని ఎస్‌పీని డిమాండ్‌ చేశారు. అజ్మీని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement