కెనడా క్రికెట్‌పై సస్పెన్షన్‌.. కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం! | ICC Changed-Major Rules-Decided Suspend Cricket Canada-Corruption | Sakshi
Sakshi News home page

కెనడా క్రికెట్‌పై సస్పెన్షన్‌.. కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం!

Jun 1 2026 7:20 PM | Updated on Jun 1 2026 9:03 PM

ICC Changed-Major Rules-Decided Suspend Cricket Canada-Corruption

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టెస్టు క్రికెట్‌లో మార్పులకు ఆమోదముద్ర వేయడంతో పాటు కెనడా క్రికెట్‌పై సస్పెన్షన్, బంగ్లా క్రికెట్ బోర్డు ఎన్నికలను పర్యవేక్షించేందుకు ఐసీసీ ఉన్నతాధికారులను నియ మించడం వంటి నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా అహ్మదాబాద్ వేదికగా ఐసీసీ చైర్మన్ జైషా నేతృత్వంలో  రెండు రోజులపాటు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఐసీసీ పలు కీలక మార్పులకు ఆమోద ముద్ర వేసింది.

అవినీతి ఆరోప‌ణ‌లు..
అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కెనడా క్రికెట్‌ను స‌స్పెండ్ చేయాల‌ని ఐసీసీ బోర్డు తీర్మానించింది. స‌భ్య‌త్వానికి సంబంధించిన బాధ్య‌త‌ల‌ను ఉల్లంఘించిన కార‌ణమే త‌క్ష‌ణ స‌స్పెన్ష‌న్‌కు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అయితే కెన‌డా క్రికెట్ బోర్డుపై వేటు వేసిన‌ప్ప‌టికీ జ‌ట్టు ఆట‌గాళ్ల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడడం ఐసీసీ మొద‌టి ప్రాధాన్య‌మ‌ని తెలిపింది. 

జాతీయ పాల‌క‌మండ‌లిని ప్ర‌భావితం చేసే పాల‌న‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల వ‌ల్ల ఆట‌గాళ్లు న‌ష్టపోకుండా చూడ‌డం త‌మ బాధ్య‌త అని ఐసీసీ తెలిపింది.స‌స్పెన్ష‌న్‌లో ఉన్న కెన‌డా క్రికెట్ బోర్డులో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి ఐసీసీ నార్మ‌లైజేష‌న్ క‌మిటీ ప‌నిచేయ‌నుందని, కెన‌డా క్రికెట్ బోర్డును తిరిగి కొత్త‌గా పున‌రుద్ధ‌రించేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని పేర్కొంది.

పింక్‌బాల్  ట్రయల్‌..
ఆటలో వెలుతురు సమస్య కారణంగా ఆట నిలిచిపోకుండా ఉండేందుకు, సంప్రదాయ రెడ్ బాల్‌కు బదులుగా అవసరమైతే పింక్ బాల్ వినియోగాన్ని ట్రయల్‌గా అనుమతించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే పింక్ బాల్ ట్రయల్‌కు షరతులతో అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.

ముందుగా ఇరు జట్ల అంగీకారంతో, చెడు వెలుతురు కారణంగా ఆట ఆగే పరిస్థితులు ఉంటే రెడ్ బాల్ స్థానంలో పింక్ బాల్ ఉపయోగించేందుకు ట్రయల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రతిపాదనను ఐసీసీ క్రికెట్ కమిటీ (మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో) అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ పరిశీలించి ఓకే చెప్పింది. 

టెస్టు క్రికెట్‌లో వెలుతురు తగ్గడం వల్ల ఆట తరచూ నిలిచిపోతుండటాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం. అధికారిక ప్రకటనలో పూర్తి విధివిధానాలు వెల్లడించకపోయినా, పరిస్థితులు క్షీణిస్తున్నప్పుడు మ్యాచ్ అధికారులు రెడ్ బాల్ నుంచి పింక్ బాల్‌కు మారే అవకాశం ఇవ్వబడుతుందని సమాచారం. 

పింక్ బాల్ సాధారణంగా డే-నైట్ టెస్టుల్లో ఉపయోగించబడుతుంది. తక్కువ వెలుతురులో మెరుగైన కనిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఓవర్‌కాస్ట్ పరిస్థితులు, త్వరగా సూర్యాస్తమయం జరిగే దేశాల్లో బాడ్ లైట్ కారణంగా ఆట ఎక్కువగా నిలిచిపోతుండటంతో ఈ నిర్ణయాన్ని ప్రాక్టికల్ సొల్యూషన్‌గా చూస్తున్నారు.

హాక్-ఐ డేటాకు అనుమతి
సందేహాస్పద బౌలింగ్ యాక్షన్‌పై రిపోర్ట్ చేసే సందర్భంలో మ్యాచ్ అధికారులు ఇకపై 'హాక్-ఐ డేటాను ఉపయోగించేందుకు' ఐసీసీ అనుమతి ఇచ్చింది. .

వన్డేల్లో హెడ్‌కోచ్‌లకు కొత్త అవకాశం
ఇక వన్డే మ్యాచ్‌లలో డ్రింక్స్ బ్రేక్ సమయంలో కోచ్‌లు మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడేందుకు అనుమతి లభించింది. ఇప్పటివరకు ఇది కేవలం సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లకే పరిమితమైంది. ప్రతి ఇన్నింగ్స్‌లో రెండు డ్రింక్స్ బ్రేక్‌లు ఉండటంతో కోచ్‌లు మ్యాచ్‌లో నాలుగు సార్లు ప్రత్యక్షంగా ఆటగాళ్లకు వ్యూహాలను చెప్పే అవకాశం పొందనున్నారు. అయితే కోచ్‌లు మైదానంలో ఎలాంటి డ్రెస్ కోడ్‌లో ఉండాలన్నది ఇంకా స్పష్టత రాలేదు.

లెగ్-సైడ్ వైడ్ రూల్‌కు శాశ్వత ఆమోదం
ఐసీసీ లెగ్-సైడ్ వైడ్‌పై సవరించిన నిబంధనను శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే ఎంసీసీ క్రికెట్ నిబంధనల్లో మిగిలిన మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

మ‌రికొన్ని నిర్ణ‌యాలు..
క్రికెట్ వరల్డ్ కప్ ఛాలెంజ్ లీగ్‌లో పాల్గొనే జట్లు, టోర్నమెంట్ సైకిల్ సమయంలో ఇతర లిస్ట్-ఏ పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడేందుకు అర్హత కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. మొత్తంగా, టెస్టు క్రికెట్‌లో ఆట సమయాన్ని పెంచడం, ఆధునిక టెక్నాలజీ వినియోగం, అలాగే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పుల దిశగా ఐసీసీ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. 

చదవండి: బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసిన ఆర్సీబీ బ్యాటర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement