పాకిస్తాన్‌కు గూఢచర్యం.. ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌ | Sakur Khan spying for Pakistan ISI Arrest AT Rajastan | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు గూఢచర్యం.. ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌

May 29 2025 1:15 PM | Updated on May 29 2025 2:50 PM

Sakur Khan spying for Pakistan ISI Arrest AT Rajastan

ఢిల్లీ: భారత్‌లో విస్తరించిన పాకిస్తాన్‌ నిఘా సంస్థలకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న పలువురిని అరెస్ట్‌ చేశారు. ఇక, తాజాగా మరో ప్రభుత్వ ఉద్యోగి గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయ్యాడు. అతడి ఫోన్‌లో పాకిస్తాన్‌కు చెందిన పలు నంబర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సకూర్‌ ఖాన్‌ మగళియార్‌ గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయ్యాడు. సకూర్‌ ఖాన్‌ స్టేట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీస్‌లో పనిచేస్తున్నాడు. తాజాగా సకూర్‌ ఖాన్‌ను సీఐడీ, ఇంటెలిజెన్స్‌ బృందాలు అదుపులోకి తీసుకొన్నాయి. ఈ సందర్బంగా ఎస్పీ సుధీర్‌ చౌధ్రీ మాట్లాడుతూ.. సకూర్‌ఖాన్‌పై గత కొన్ని వారాలుగా దర్యాప్తు బృందాలు నిఘా పెట్టాయి. అతడికి పాక్‌ దౌత్య కార్యాలయంతో సంబంధాలపై కూడా సందేహాలున్నాయి. సకూర్‌ అనుమానాస్పద కార్యకలాపాల గురించి ఉన్నత స్థాయి నుంచి సమాచారం అందింది. దీంతో వాటిని ప్రశ్నించి.. నిర్ధారించుకునేందుకు అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు.

ఇక, సకూర్‌ ఖాన్‌ ఫోన్‌లో పలు పాకిస్థానీ నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి గురించి సంతృప్తికరమైన వివరణ మాత్రం అతడి నుంచి రావడం లేదని దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. పాక్‌ను దాదాపు ఏడుసార్లు సందర్శించినట్లు అతడు అంగీకరించాడు. ఇప్పటివరకు అతడి ఫోన్‌లో ఎటువంటి మిలిటరీ సమాచారం లేదని అధికారులు వెల్లడించారు. కాకపోతే కొన్ని ఫైల్స్‌ను అతడు డిలీట్‌ చేసినట్లు గుర్తించారు. ఇక ఖాన్‌కు ఉన్న రెండు బ్యాంకు ఖాతాలపై దృష్టిసారించారు.

ఇదిలా ఉండగా.. సకూర్‌ ఖాన్‌ స్వస్థలం పాక్‌ సరిహద్దుల్లోని జైసల్మేర్‌ జిల్లా బరోడా గ్రామంలోని మంగళియార్‌ ధాని. ఇతడు గత రాష్ట్ర ప్రభుత్వంలో ఓ మంత్రికి వ్యక్తిగత సహాయకుడిగా కూడా పనిచేయడం సంచలనంగా మారింది. సదరు మాజీ మంత్రిది కూడా ఇదే గ్రామం కావడం గమనార్హం. దర్యాప్తు వర్గాలు మాత్రం రాజకీయ లింక్‌లపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 

 

Advertisement
 
Advertisement
Advertisement