
దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత.. ఠాక్రే సోదరులు ఒక్కటి కావడం తెలిసిందే. ఈ కలయికతో మహా రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నాయని అంతా ఎదురు చూస్తున్నారు. కానీ, రెండు నెలలు తిరగకుండానే ఈ కజిన్స్‌కు తొలి షాక్ తగిలింది.
ఉద్దవ్ శివసేన(Shivsena UBT)- మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS)కూటమి తొలి పరీక్షలోనే ఫెయిల్ అయ్యింది. ముంబై బెస్ట్ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఈ ఎన్నికలు త్వరలో జరగబోయే ముంబై కీలక మున్సిపల్ ఎన్నికలకు వార్మప్ మ్యాచ్‌గా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. దీంతో ‘‘ఠాక్రే బ్రాండ్ ఫ్లాప్’’ అంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది.
‘‘ఇది కేవలం సహకార ఎన్నిక మాత్రమే కాదు, ఒక్కసారి విడిపోయిన ఠాక్రే సోదరులు మళ్లీ కలిసిన తర్వాత వారి రాజకీయ పునరాగమనానికి ఇది ఒక పరీక్ష. బీజేపీ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో విజయవంతంగా దూసుకుపోతున్న నేపథ్యంలో.. ఈ మొదటి అడ్డంకినే ఠాక్రేలు దాటలేకపోయారు’’ అక్కడి మీడియాలో విశ్లేషణ జరుగుతోంది. అయితే..
ఈ ఫలితాలు వెలువడిన మరుసటిరోజే మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను అధికార నివాసం వర్ష బంగ్లాకు వెళ్లి కలిశారు. సుమారు గంటన్నరపాటు ఇద్దరూ చర్చించుకున్నారు. దీంతో ఉద్దవ్‌కు రాజ్ హ్యాండిస్తారా? అనే ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే..
కాసేపటికే ఊహాగానాలకు రాజ్ ఠాక్రే తెర దించారు. ఇది రాజకీయ భేటీ ఎంతమాత్రం కాదని, నగర అభివృద్ధికి సంబంధించిన విషయాలపై సీఎంతో చర్చించినట్లు మీడియాకు తెలిపారు.
గ్రేటర్ ముంబైను వర్షాలు ముంచెత్తడం, అదే సమయంలో నగరంలో ట్రాఫిక్ జామ్ పెరిగిపోతుండడం లాంటి అంశాలపైనే చర్చించినట్లు తెలిపారు. ‘‘పావురాలు, ఏనుగులు అంటూ అవసరం లేని విషయాలపై ముంబైని అధికార యంత్రాంగం ఎటో తీసుకుని పోతోంది. ఇరుకు రోడ్లలో వర్షాల వల్ల పడుతున్న కష్టాల గురించి సీఎంకు వివరించా. రోడ్ల విస్తరణ తద్వారా ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే అంశాల గురించి చర్చించా.. అంతే’’ అని రాజ్ ఠాక్రే తెలిపారు. ఈ భేటీలో నగర పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మహారాష్ట్రలో హిందీ భాషను బలవంతంగా ప్రవేశపెడుతున్నారంటూ రాజ్ ఠాక్రే బీజేపీకి దూరం జరిగి.. సోదరుడు ఉద్దవ్ ఠాక్రేకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ కలిసి జులై 5వ తేదీన ముంబైలో ఆవాజ్ మరాఠీచి అనే కార్యక్రమం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫడ్నవిస్ ప్రభుత్వం హిందీ భాష అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోగా.. అయినాకూడా ఆ అపూర్వ కలయిక కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఫడ్నవిస్ వల్లే తాము ఒక్కటయ్యామని, మరాఠీ గౌరవం పేరిట తాము ఇకపై కలిసే పోరాడతామంటూ ప్రకటించారు కూడా.