ముంబై: మహారాష్ట్రలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే సంచలనం నమోదైంది. ఒక్క ఓటు కూడా వేయకముందే అధికార ‘మహాయుతి’ కూటమి ఘనవిజయం సాధించింది. నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో, వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో బీజేపీ-శివసేన (షిండే వర్గం) కూటమికి చెందిన 66 మంది అభ్యర్థులు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు..మొత్తంగా 68 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)పరిధిలోని అత్యంత కీలకమైన కళ్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికార కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఇక్కడ ఏకంగా 21 మంది మహాయుతి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఇందులో 15 స్థానాలను బీజేపీ దక్కించుకుంది. ఆరు స్థానాల్లో శివసేన అభ్యర్థులు విజయం సాధించారు. ఉత్తర మహారాష్ట్రలోని జలగావ్, పన్వెల్, భివాండీ తదితర ప్రాంతాల్లో కూడా బీజేపీ తన పట్టును నిరూపించుకుంటూ, ఏకగ్రీవ విజయాలను నమోదు చేసింది.
కాగా ఈ ఏకగ్రీవ విజయాలపై ప్రతిపక్ష పార్టీలైన శివసేన (యుబిటి), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పక్షం డబ్బు ఎరవేసి, బెదిరింపులకు గురిచేసి, తమ అభ్యర్థులతో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేసిందని ఆయా పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ, ఈ ఉపసంహరణలు స్వచ్ఛందంగా జరిగాయా లేక ఒత్తిడి కారణంగా జరిగాయా అన్న కోణంలో విచారణకు ఆదేశించింది. ఈ మధ్యనే జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మహాయుతికి, తాజా ఏకగ్రీవ ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఏకనాథ్ షిండే సొంత ఇలాకా అయిన థానేలో కూడా శివసేన ఆరు స్థానాలను కైవసం చేసుకోగా, అజిత్ పవార్ ఎన్సీపీ.. అహల్య నగర్‌లో రెండు చోట్ల విజయం సాధించింది.
ఇది కూడా చదవండి: మాఘ మేళా షురూ.. కుంభమేళాను తలపిస్తున్న జనం


