సాక్షి, ఢిల్లీ: నీట్ వ్యవహారంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అత్యంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. ఈ మెుత్తం ఎపిసోడ్‌లో ఆయన వ్యవహారించిన తీరు తనను తీవ్ర అసహానానికి గురిచేసిందన్నారు. ఇటీవల నీట్ పరీక్ష ముగిసిన నేపథ్యంలో ఈరోజు( మంగళవారం) ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.
జాతీయ మీడియాకు ఇచ్చిన ముఖాముఖీలో ఆయన మాట్లాడుతూ "ప్రశ్నలు అడిగే హక్కు ప్రతిపక్షానికి ఉంది. కానీ పరీక్షకు మూడు రోజుల ముందు, విద్యార్థులను భయపెట్టడానికి, వారి సన్నద్ధతను దెబ్బతీయడానికి రాహుల్ గాంధీ కోటాలో ఒక కార్యక్రమం నిర్వహించారు.విద్యార్థుల సన్నద్ధతను దెబ్బతీయడానికి, అరాచకాన్ని సృష్టించడానికి ఆయన ప్రయత్నించారు" అని అన్నారు.
నీట్ పరీక్ష లీకేజ్‌తో విద్యార్థుల ఆత్మహత్యల పట్ల తీవ్ర కలత చెందాను. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రిగా, విద్యార్థి ఆత్మహత్య జరిగిన ప్రతిసారీ నన్ను నేనే తిట్టుకుంటాను. ఈ విచ్ఛిన్నమైన వ్యవస్థను మనం సరిదిద్దాలి. కానీ కాంగ్రెస్, రాహుల్ గాంధీ విద్యార్థుల ఆత్మహత్యలను వాడుకున్న తీరు నీచమైన రాజకీయాలని మండిపడ్డారు. ప్రస్తుత వ్యవస్థను ఎలా మెరుగుపరచాలనే దానిపై రాహుల్ గాంధీ , కాంగ్రెస్ నుంచి ఇదివరకూ ఒక్క సానుకూల సూచన కూడా తనకు అందలేదన్నారు.
ఒక విద్యార్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రాన్నివిద్యార్థి తండ్రి అభ్యర్థన మేరకే కేటాయించారని మంత్రి స్పష్టం చేశారు. "ఈ విషయం వెలుగులోకి రాగానే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొన్ని గంటల్లోనే స్పందించి, కేంద్రాన్ని నాగ్‌పూర్‌కు మార్చిందని తెలిపారు. ఈ ఘటనను సైతం రాహుల్ గాంధీ రాజకీయాలకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
కాగా నీట్-యూజీలో పేపర్ లీక్‌లు, పరీక్షా కేంద్రాల సమస్యలతో సహా జరిగిన అవకతవకలపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్.. ప్రభుత్వంపై పదేపదే విమర్శలు గుప్పించాయి. గత వారం కోటాలో విద్యార్థులతో జరిగిన ఒక సమావేశంలో గాంధీ మాట్లాడుతూ, పరీక్షా విధానం మోసపూరితంగా ఉందని, విద్యా వ్యవస్థలోని అవినీతి కారణంగా లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


