ఈసీపై రాహుల్‌ గాంధీ నెక్స్ట్‌ స్టెప్‌ ఇదేనా? | Rahul Gandhi Next Move Against the Election Commission details Here | Sakshi
Sakshi News home page

ఈసీపై రాహుల్‌ గాంధీ నెక్స్ట్‌ స్టెప్‌ ఇదేనా?

Oct 7 2026 7:13 AM | Updated on Oct 7 2026 7:13 AM

Rahul Gandhi Next Move Against the Election Commission details Here

ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై విపక్షాల పోరు మరింత ఉధృతమవుతోంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ‘ఓట్‌ చోరీ’ ఆరోపణలపై ఇండియా కూటమి చేపట్టిన మార్చ్‌ మంగళవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అడ్డుకోవడంతో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. అయితే రాత్రి వారిని విడుదల చేశారు. దీంతో ఇవాళ ఉద్యమం తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది.

ఎన్నికల సంఘంపై అదే పోరును దేశవ్యాప్త ఆందోళనగా మలిచేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. రాష్ట్రపతిని కలిసేందుకు సమయం కోరడంతో పాటు.. నవంబర్‌ 1న రామ్‌లీలా మైదాన్‌లో భారీ సభకు కూటమి సన్నద్ధమవుతోంది. నిన్నటి ఘటనకు కొనసాగింపుగా కాంగ్రెస్‌ ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో ఎన్నికల సంఘం కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఢిల్లీలోనూ ఆందోళనలు కొనసాగనున్నాయి. ఎన్నికల జాబితాల్లో అవకతవకలు జరుగుతున్నాయని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపిస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది.

ఆకాశవాణి భవన్‌ వద్ద..
మంగళవారం ఉదయం పార్లమెంట్‌ మకర్‌ ద్వార్‌ నుంచి దాదాపు 200 మంది ఎంపీలు ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్‌ ప్రారంభించారు. అఖిలేశ్‌ యాదవ్‌, అభిషేక్‌ బెనర్జీ, మనోజ్‌ ఝా, డెరెక్‌ ఓబ్రెయిన్‌ తదితర విపక్ష నేతలు పాల్గొన్నారు. పోలీసులు భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి మార్చ్‌ను అడ్డుకున్నారు.

రాహుల్‌ గాంధీ బారికేడ్‌పైకి ఎక్కి జాతీయ జెండాను ఊపారు. అనంతరం పలువురు నేతలను పోలీసులు బస్సుల్లోకి ఎక్కించారు. రాహుల్‌ మాత్రం ఆకాశవాణి భవన్‌ వైపు వెళ్లారు. ప్రియాంక గాంధీ కూడా ఆయనతో చేరారు. కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం జరిగిన అనంతరం వారిని ఆకాశవాణి భవన్‌ ప్రాంగణంలోకి అనుమతించారు. అక్కడే ఇద్దరూ బైఠాయించి నిరసన చేపట్టారు.

రాత్రి హైడ్రామా
ఆకాశవాణి భవన్‌ ప్రాంగణంలో కొనసాగిన నిరసన అనంతరం రాహుల్‌, ప్రియాంక సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని కింగ్స్‌వే క్యాంప్‌ న్యూ పోలీస్‌ లైన్స్‌కు తరలించారు. రాత్రి 10 గంటల తర్వాత వారిని విడుదల చేశారు. దీంతో ఇవాళ రాహుల్‌, ప్రియాంకలు స్వేచ్ఛగా ఉండగా.. తదుపరి నిరసన కార్యక్రమాలపై కాంగ్రెస్‌ దృష్టి పెట్టింది.

రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నం
ఇండియా కూటమి తమ పోరును మరో స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఎన్నికల సంఘంపై తమ అభ్యంతరాలను రాష్ట్రపతికి వివరించేందుకు సమయం కోరింది. అక్టోబర్‌ 7, 8 లేదంటే 9 తేదీల్లో భేటీకి అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ బృందంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీతో పాటు మమతా బెనర్జీ, అఖిలేశ్‌ యాదవ్‌, శరద్‌ పవార్‌, ఒమర్‌ అబ్దుల్లా, తేజస్వీ యాదవ్‌ తదితరులు ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికల సంఘాన్ని కలవాలన్న ప్రయత్నమూ నిన్న ఫలించలేదు. అయితే ముందుగా అపాయింట్‌మెంట్‌ తీసుకుంటే అభ్యంతరం లేదని ఈసీ వర్గాలు అంటున్నాయి. 

నవంబర్‌ 1న భారీ సభ
మరోవైపు ఈసారి బిజూ జనతాదళ్‌ (బీజేడీ) కూడా ఇండియా కూటమికి మద్దతుగా వీధుల్లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు బీజేడీ ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు. గతంలో ఇలాంటి కార్యక్రమాల్లో బీజేడీ దూరంగా ఉండేది. ఇక ఇవాళ్టి నిరసనలతోనే ఉద్యమాన్ని ముగించకుండా.. నవంబర్‌ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ సభ నిర్వహించేందుకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. అప్పటివరకు రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో నిరసనలు, సభలు, మార్చ్‌లు నిర్వహించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. 

ఇదీ చదవండి: ఒక దేశం.. ఒకే పార్టీ అనే కుట్రా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement