ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: సదుద్దేశంతో ముందడుగు వేసి, తమ ఆశయాలను నెరవేర్చే రాజకీయ పార్టీలనే ప్రజలు విశ్వసిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలో ఆరో రామ్‌నాథ్ గోయంకా స్మారకోపన్యాస కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వామపక్ష పార్టీనా, మితవాద పార్టీనా అనేది ముఖ్యంకాదు. అభివృద్ధి విధానాలతో ఏ పార్టీ అయితే ముందుకెళ్తుందో ఆ పార్టీలకు మాత్రమే భవిష్యత్తు ఉంటుందని బిహార్‌లో తాజా శాసనసభ ఎన్నికల ఫలితాలు రుజువుచేశాయి.
ప్రాంతీయ పార్టీల సారథ్యంలో కేంద్రంలో లేదా రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వాల దృష్టి మొత్తం అభివృద్ధి మీదనే ఉండాలి. భారతదేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు పెద్దగానే ఉంటాయని బిహార్ ఎన్నికలు నిరూపించాయి. అధికారం చేపట్టి సదుద్దేశంతో సత్కార్యాలు చేసే రాజకీయ పక్షాల వెంటే ప్రజలు నడుస్తారు. మళ్లీ వాళ్లకే ఓటేస్తారు. అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకుంటారు. విదేశాల నుంచి తమ రాష్ట్రానికే భారీ పెట్టుబడులు వచ్చేలా బడా కంపెనీలను ఆకర్షిస్తూ, రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే రాష్ట్ర ప్రభుత్వా లను ఎప్పుడూ నా పూర్తి మద్దతు ఉంటుంది’’ అని అన్నారు.
ఎలక్షన్ మోడ్ కాదు ఎమోషనల్ మోడ్
‘‘బీజేపీ ఎప్పుడూ ఎన్నికల మీదే దృష్టిపెడుతుందని కొందరు అ భాండాలు వేస్తున్నారు. నిజానికి మేం ఎలక్షన్ మోడ్‌లో ఉండబోం. ఎన్నికల ప్రచారంవేళ ప్రజలతో మమేకమయ్యే ఎమోషనల్ మోడ్‌లో ఉంటాం. రోజూ 24 గంటలూ అభివృద్ధి, ప్రజల భావోద్వేగాల గురించే పట్టించుకుంటాం. అందుకే ప్రతిసారి మాకు విజయం దక్కుతోంది’’ అని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించారు. ‘‘ నక్సలిజం, మావోయిస్ట్ టెర్రరిజంకు కొమ్ముకాస్తున్న కాంగ్రెస్ దేశంలో ఉనికిని కోల్పోతోంది. కేవలం విపక్షపార్టీగా మాత్రమే మిగిలిపోతోంది. గత ఐదు దశాబ్దాల్లో దేశంలో ప్రతి రాష్ట్రం మావోయిస్టుల దురాగతాలను చవిచూసింది. దేశ రాజ్యాంగాన్ని నమ్మని అలాంటి వాళ్లను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోంది’’ అని మోదీ ఆరోపించారు.


