
పశ్చిమ బెంగాల్‌లో మహిళలకు రక్షణ లేదు
విచ్చలవిడిగా వసూళ్ల దందా సాగుతోంది
డబ్బుల కోసం పారిశ్రామికవేత్తలను పీడిస్తున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం
దుర్గాపూర్: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని, వారు నిత్యం భయంభయంగా బతకాల్సి వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన మృగాళ్లను ఆ పార్టీ కాపాడుతోందని ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్వాకం వల్ల బెంగాల్‌లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న వసూళ్ల దందా చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడం లేదని చెప్పారు. ప్రధాని మోదీ శుక్రవారం బెంగాల్‌లో పర్యటించారు. చమురు, గ్యాస్, విద్యుత్, రైలు, రహదారులకు సంబంధించిన రూ.5,400 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా దుర్గాపూర్‌లో బహిరంగ సభలో మాట్లాడారు.
కోల్‌కతా ఆసుపత్రిలో యువ వైద్యురాలిపై ఘోరంగా అత్యాచారం జరిగిందని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారిని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తోందని ధ్వజమెత్తారు. ఆ అత్యాచార ఘటన పట్ల దేశమంతా కలవరపాటుకు గురైందని, ఇప్పటికీ కోలుకోలేదని అన్నారు. ఆ ఘటన మర్చిపోకముందే మరో కాలేజీలో మహిళపై అత్యాచారం జరిగిందని ఆక్షేపించారు. ఈ కేసులో నిందితుడికి తృణమూల్ కాంగ్రెస్‌తో సంబంధాలు ఉన్నట్లు బయటపడిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో గూండా ట్యాక్స్
‘‘బెంగాల్‌లో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయి. ప్రజలకు రక్షణ కల్పించడంలో, న్యాయం చేకూర్చడంలో తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. ముర్షీదాబాద్‌లో అల్లర్లు జరిగితే పోలీసులు బాధితులనే వేధించారు. బాధ్యులను వదిలేశారు. రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఆశలు అడుగంటాయి. వారి ప్రాణాలకే భద్రత లేకుండాపోయింది.
ఇదంతా ప్రభుత్వ నిర్వాకం కాదా? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డబ్బుల కోసం పారిశ్రామికవేత్తలను పీడిస్తోంది. రాష్ట్రంలో ఆర్థిక ప్రగతికి అడ్డు తగులుతోంది. గూండా ట్యాక్స్‌కు భయపడి పారిశ్రామికవేత్తలు బెంగాల్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పెట్టుబడులు రావడం, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం తృణమూల్ కాంగ్రెస్‌కు ఎంతమాత్రం ఇష్టం లేదు. బెంగాల్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని మేము సంకల్పించాం. దేశ ప్రగతికి బెంగాల్‌ను చోదక శక్తిగా మారుస్తాం’’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
ఈశాన్య భారత అభివృద్ధికి ‘వికసిత్ బిహార్’
మోతిహరీ: ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించాలన్న నిర్ణయం బిహార్ గడ్డపైనే తీసుకున్నానని, అది ఎలా విజయవంతమైందో ప్రపంచం చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈశాన్య భారతదేశ సమగ్రాభివృద్ధికి ‘వికసిత్ బిహార్’ అత్యంత కీలకమని స్పష్టంచేశారు. రాష్ట్ర బహుముఖ ప్రగతికి కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ శుక్రవారం బిహార్‌లో పర్యటించారు. తొలుతు తూర్పు చంపారన్ జిల్లాలో రూ.7,200 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.
మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మోతిహరీ జిల్లా కేంద్రంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘బనాయేంగే నయా బిహార్, ఫిర్ ఏక్‌బార్ ఎన్డీయే సర్కార్’ అనే నూతన నినాదం ఇచ్చారు. దీవసూళ్ల దందానిపై జనం పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. మళ్లీ ఎన్డీయే ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని, సరికొత్త బిహార్‌ను నిర్మించుకుందామని మోదీ ఇచ్చిన పిలుపును స్వాగతించారు.
బిహార్‌లో విపక్ష కాంగ్రెస్–ఆర్జేడీ కూటమిపై ప్రధానమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఆర్జేడీ ప్రభుత్వం పేదల భూములు బలవంతంగా లాక్కుందని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. పేదలు, అణగారినవర్గాల పేరిట కాంగ్రెస్–ఆర్జేడీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. బిహార్ వెనుకబాటుతనానికి ఆ రెండు పారీ్టలే కారణమని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా యువత సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని మోదీ వెల్లడించారు. ఇందుకోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించారు. బిహార్ సర్వతోముఖాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, గత 45 రోజుల్లో 24,000 స్వయం సహాయక సంఘాలకు రూ.1,000 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. మోతిహరీని ముంబై తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మహాత్మా గాంధీ పోరాటానికి బిహార్‌లోని చంపారన్ నూతన దిశను నిర్దేశించిందని మోదీ గుర్తుచేశారు.