
పలు బిల్లులకు పార్లమెంట్ ఆమోదం
కళంకిత నేతల బిల్లు మొదలు, ఎస్‌ఐఆర్‌దాకా పలు అంశాలపై
చర్చలతో అట్టుడుకిన పార్లమెంట్ ఉభయసభలు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆరంభమైంది మొదలు ఉభయసభలు ప్రతిరోజూ మాటల మంటలతో రగిలిపోయి గురువారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) అంశంతో తొలిరోజు నుంచే విపక్షసభ్యుల నుంచి తీవ్ర ఆందోళనలు, అభ్యంతరాలు వెల్లువెత్తినాసరే అధికార పార్టీ ఎట్టకేలకు ఈ వర్షాకాల సెషన్‌లో లోక్‌సభలో 12 బిల్లులు, రాజ్యసభలో 14 బిల్లులకు మోక్షం ప్రసాదించింది. ఐదేళ్లకు మించి శిక్షపడే స్థాయి నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్రమంత్రులను పదవుల నుంచి తొలగించే మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు ఈ సెషన్ మొత్తంలోనే ఉధృతస్థాయిలో విపక్షనేతల నుంచి ప్రతిఘటన ఎదురైంది.
మొత్తం సెషన్ ఆద్యంతం వాగ్వాదాలు, వాయి దాలు, వాకౌట్‌లతో కొనసాగింది. లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లుల్లో ఆన్‌లైన్ గేమింగ్ ప్రచారం, నియంత్రణ బిల్లు–2025, ఆదాయపన్ను బిల్లు– 2025, జాతీయ క్రీడల నిర్వహన బిల్లు– 2025, జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ), బిల్లు–2025, పన్నుల చట్టాల(సవరణ) బిల్లు– 2025, ఇండియన్ పోర్ట్స్ బిల్లు, ఐఐఎం(సవరణ) బిల్లు వంటి కీలక బిల్లులు ఉన్నాయి. ల్యాండింగ్ బిల్లు–2025, సముద్రమార్గంలో సరకు రవాణా బిల్లు–2025, తీరప్రాంతంలో రవాణా బిల్లు–2025 14 బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాయి.
విలువైన కాలాన్ని కోల్పోయిన లోక్‌సభ
మొత్తం సెషన్‌లో లోక్‌సభ పలుమార్లు వాయిదా పడిన కారణంగా మొత్తంగా 84 గంటల పనిగంటలను కోల్పోయింది. 18వ లోక్‌సభలో ఇన్ని గంటలను వృథాగా కోల్పోవడం ఇదే తొలిసారి. జూలై 21న మొదలైన లోక్‌సభ మొత్తంగా 21 రోజులు సమావేశమైంది. కేవలం 37 గంటల 7 నిమిషాలు మాత్రమే లోక్‌సభ సజావుగా సాగిందని లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది.
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు తర్వాత..
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించాక రాజ్యసభ సైతం నిరవధికంగా వాయిదాపడింది. విపక్ష సభ్యులు పదేపదే అడ్డుతగలడంతో మొత్తం సెషన్‌లో విలువైన కాలం వృథా అయిందని రాజ్యసభ డెప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘రాజ్యసభ కేవలం 41 గంటల 15 నిమిషాలు మాత్రమే సజావుగా సాగిందని చెప్పారు. బిహార్ ఓటర్ల జాబితా, ఆప రేషన్ సిందూర్, నేరారోపణలు ఎదుర్కొంటున్న పీఎం, సీఎం, మంత్రుల ఉద్వాసన బిల్లులపై విపక్షాలు నిరసనలతో ఉభయసభలో హోరెత్తాయి. జగదీప్‌ధన్‌ఖడ్ అనూహ్యంగా తన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం సైతం సభను కుదిపేసింది.