కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)రాజ్యసభ ఎంపీ మౌసమ్ నూర్ అనూహ్యంగా తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి, తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. తన మేనమామ, దివంగత కాంగ్రెస్ దిగ్గజం గనీ ఖాన్ చౌదరి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు.
వచ్చే ఏప్రిల్‌తో మౌసమ్ నూర్ రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. ఆమె త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మాల్దా జిల్లా నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె 2009 నుండి 2019 వరకు మాల్దా దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా గతంలో పశ్చిమ బెంగాల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా ఆమె కీలక బాధ్యతలు చేపట్టారు.
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మౌసమ్ నూర్ అధికారికంగా పార్టీ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం అహ్మద్ మీర్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సుభంకర్ సర్కార్ సమక్షంలో ఆమె పార్టీలోకి తిరిగి ప్రవేశించారు. పార్టీ అగ్రనేతలు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ చేరికతో బెంగాల్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
కాంగ్రెస్‌లో చేరికపై మౌసమ్ నూర్ స్పందిస్తూ ‘పశ్చిమ బెంగాల్‌కు మార్పు అవసరం, ఆ మార్పు నా నుండే మొదలు కానివ్వండి’ అని వ్యాఖ్యానించారు. తాను ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరానని, కాంగ్రెస్ సిద్ధాంతాలైన లౌకికవాదం, అభివృద్ధి, శాంతిపై మాల్దాలోని ప్రజలకు గట్టి నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే తన రాజీనామా లేఖను టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి పంపినట్లు తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు శ్రమిస్తానని మౌసమ్ నూర్ అన్నారు.
ఇది కూడా చదవండి: Bangladesh: హిందువుల సంచలన నిర్ణయం.. ఎన్నికలపై పిడుగుపాటు


