
శనివారం రాత్రి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ ప్రాంతంలో పాకిస్తాన్ డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న భారత గగనతల రక్షణ వ్యవస్థ
పాకిస్తాన్ రెండు నాల్కల ధోరణి
కాల్పుల విరమణకు ఒప్పందం
కోరి మరీ కుదుర్చుకున్న దాయాది
డీజీఎంఓ స్థాయి చర్చల్లో అంగీకారం
సాయంత్రం ఐదింటి నుంచే అమల్లోకి
కాసేపటికే మళ్లీ దాడులకు దిగిన పాక్
క్షిపణులు, డ్రోన్లు, సరిహద్దుల్లో కాల్పులు
దుర్మార్గ వైఖరిపై మండిపడ్డ భారత్
అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం
తక్షణం ఒప్పందానికి కట్టుబడండి
విదేశాంగ కార్యదర్శి మిస్రీ హెచ్చరిక
ఒప్పందం కుదిర్చింది అమెరికానే
అంతకుముందు ట్రంప్ అనూహ్య ప్రకటన
ద్వైపాక్షిక ఒప్పందమేనన్న కేంద్రం
న్యూఢిల్లీ/వాషింగ్టన్/ఇస్లామాబాద్
కయ్యానికి కాలుదువ్విన దాయాదికి నాలుగు రోజుల్లోనే తత్వం బోధపడింది. సాయుధ ఘర్షణకు తెర దించుదామంటూ భారత్‌తో కాళ్లబేరానికి వచ్చింది. దాంతో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు ప్రభుత్వాలూ దాన్ని ధ్రువీకరించాయి. తమ మధ్యవర్తిత్వమే ఇందుకు కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా భారత్ దాన్ని తోసిపుచ్చింది. పాక్ విజ్ఞప్తి మేరకే ద్వైపాక్షిక చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. ‘‘శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.
భూ, గగన, సముద్ర తలాల్లో పూర్తిస్థాయిలో కొనసాగుతుంది’’ అని విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ మీడియాకు వెల్లడించారు. కానీ కాసేపటికే పాక్ వంకర బుద్ధి ప్రదర్శించింది. శనివారం రాత్రి ఏడింటి నుంచీ మరోసారి దాడులకు దిగింది. సరిహద్దుల గుండా మళ్లీ డ్రోన్ ప్రయోగాలకు, కాల్పులకు తెగబడింది. కోరి కుదుర్చుకున్న విరమణ ఒప్పందానికి గంటల వ్యవధిలోనే తూట్లు పొడిచి తాను ధూర్తదేశాన్నేనని మరోసారి నిరూపించుకుంది. ఈ పరిణామంపై భారత్ మండిపడింది. రాత్రి 11 గంటలకు మిస్రీ మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఓవైపు విరమణ అంటూనే మరోవైపు సరిహద్దుల వెంబడి పాక్ తిరిగి దాడులు, కాల్పులకు దిగిందంటూ ధ్వజమెత్తారు.
ఒప్పందం కుదిరిందన్న ట్రంప్
పాక్ దొంగ నాటకాల నడుమ శనివారం రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటేదాకా పాక్ సైన్యం క్షిపణి, డ్రోన్ దాడులు, సరిహద్దుల వెంబడి కాల్పులు కొనసాగించింది. వాటికి దీటుగా బదులిచ్చిన భారత్ శనివారం తెల్లవారుజాము నుంచీ తీవ్రస్థాయిలో ప్రతి దాడులకు దిగింది. ఆరు పాక్ వైమానిక, రెండు రాడార్ కేంద్రాలను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల నడుమ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్య ప్రకటన చేశారు.
సొంత సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ సోషల్‌లో సాయంత్రం ఐదింటి ప్రాంతంలో ఈ మేరకు పోస్ట్ చేశారు. ‘‘అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా జరిగిన చర్చోపచర్చల అనంతరం ఎట్టకేలకు ఇరు దేశాలూ తక్షణం పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి’’ అని పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా అవే వ్యాఖ్యలు చేశారు. ప్రధానులు నరేంద్ర మోదీ, షహబాజ్ షరీఫ్‌లకు అభినందనలు తెలిపారు. ట్రంప్ బృందం ఈ దిశగా అద్భుతంగా పని చేసిందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పుకొచ్చారు. సాయంత్రం ఆరింటికి విదేశాంగ కార్యదర్శి మిస్రీ మీడియా ముందుకొచ్చారు.
‘‘పాక్ విజ్ఞప్తి మేరకే విరమణకు ఒప్పుకున్నాం. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత డీజీఎంఓకు ఫోన్ చేశారు. వారి నడుమ చర్చల ఫలితంగా ఈ మేరకు ఒప్పందం కుదిరింది’’ అని స్పష్టం చేశారు. దీనిపై డీజీఎంఓల నడుమ సోమవారం పూర్తిస్థాయి చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ‘‘శాంతి సాధనకు ఇది నూతన ప్రారంభం. కాల్పుల విరమణకు చొరవ చూపినందుకు ట్రంప్, వాన్స్, రూబియోలకు కృతజ్ఞతలు’’ అంటూ పాక్ ప్రధాని షహబాజ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టి(పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో, ప్రజాప్రతినిధులు తదితరులు ఒప్పందాన్ని స్వాగతించారు. అనంతరం తన గగనతలాన్ని తెరుస్తున్నట్టు పాక్ ప్రకటించింది.
బయటపడ్డ పాక్ నైజం
కొద్ది గంటలైనా గడవకుండానే పాక్ తన బుద్ధి బయటపెట్టుకుంది. విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రి ఏడింటి నుంచే మరోసారి సరిహద్దుల వెంబడి దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్ మొదలుకుని గుజరాత్ దాకా పలుచోట్ల డ్రోన్ దాడులు జరిగాయి. శ్రీనగర్‌లో భారీ పేలుడు శబ్దాలు విని్పంచాయి. బారాముల్లా తదితర చోట్ల సైనిక స్థావరాల సమీపంలో డ్రోన్లు ఎగురుతూ కని్పంచాయి. దీనిపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు.
‘‘శ్రీనగర్ అంతటా పేలుళ్ల శబ్దాలే. ఏమిటిది? విరమణకు అప్పుడే తూట్లా?’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు మొదలయ్యాయి. పాక్ దాడులకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. జమ్మూ, శ్రీనగర్, గుజరాత్‌లోని భుజ్ తదితర చోట్ల పాక్ డ్రోన్లను బలగాలు కూల్చేశాయి. కచ్ తదితర చోట్ల కూడా డ్రోన్లు కని్పంచినట్టు రాష్ట్ర మంత్రి హర్‡్ష సంఘవి ధ్రువీకరించారు. ముందుజాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో పలుచోట్ల కరెంటు సరఫరా నిలిపేసి బ్లాకౌట్ పాటించారు. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే పాక్ ఉల్లంఘించింది. ఇది అత్యంత దుర్మార్గం. ఇందుకు పూర్తి బాధ్యత ఆ దేశానిదే. దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. మతిలేని చర్యలను ఇకనైనా కట్టిపెట్టి కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ పూర్తిస్థాయిలో కట్టుబడాలి. లేదంటే తీవ్రస్థాయిలో ప్రతిక్రియ తప్పదు. దాడులను దీటుగా తిప్పికొట్టాల్సిందిగా సైన్యానికి పూర్తిస్థాయి ఆదేశాలిచ్చాం.
– విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ