
అనుమానాలున్నాయ్.. ప్రభుత్వం నివృత్తి చేయాలి
పార్లమెంట్‌లో తేల్చిచెప్పిన ప్రతిపక్షాలు
నిరసనలు, నినాదాలతో పలుమార్లు వాయిదా పడిన ఉభయ సభలు
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్)పై ప్రతిపక్షాలు ఎంతకీ పట్టువీడడం లేదు. గత నెల 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అంశంపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వెంటనే చర్చించాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సైతం పార్లమెంట్‌లో అలజడి సృష్టించాయి. ఈ ప్రక్రియపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం వాటిని నివృత్తి చేయాలని విపక్ష ఎంపీలు తేల్చిచెప్పారు. నిరసనలు, నినాదాలతో లోక్‌సభ, రాజ్యసభ హోరెత్తిపోయాయి. లోక్‌సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
నినాదాల హోరు
లోక్‌సభలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా.. కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరెన్ సహా ముగ్గురు దివంగత సభ్యులకు నివాళులరి్పంచారు. అనంతరం విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు ప్రారంభించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఎస్‌ఐఆర్‌పై చర్చకు ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు. ఇంతలో స్పీక ర్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. అయినప్పటికీ నినాదాలు ఆగకపోవడంతో విపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ గౌరవాన్ని దిగజార్చేలా ప్రవర్తించవద్దని హితవు పలికారు. సభకు సహకరించాలని కోరారు.
విపక్ష ఎంపీలు వినిపించుకోకపోవడంతో సభను మ« ద్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్షాలు శాంతించకపోవడంతో సభను బుధవారానికి వాయి దా వేస్తున్నట్లు ఓం బిర్లా ప్రకటించారు. అంతకుముందు గోవా అసెంబ్లీలో ఎస్టీలకు రిజర్వేషన్లు కలి్పంచేందుకు ఉద్దేశించిన బిల్లు లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై రాజ్యసభలోనూ రగడ యథాతథంగా కొనసాగించింది.
ఎస్‌ఐఆర్‌పై చర్చకు రూల్ 267 కింద విపక్షాలు 34 వాయిదా తీర్మానం నోటీసులు ఇవ్వగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. వెంటనే చర్చ ప్రారంభించాలన్న విపక్షాల డిమాండ్ పట్ల సభాపతి సానుకూలంగా స్పందించలేదు. కాంగ్రెస్ సహా ఇతర పారీ్టల ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేస్తుండడంతో సభ తొలుత రెండుసార్లు.. చివరకు బుధవారానికి వాయిదా పడింది.
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ తీర్మానం లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందగా, రాజ్యసభలో మంగళవారం ఆమోదించారు. అలాగే కస్టమ్స్ టారిఫ్ యాక్ట్–1975లోని రెండో షెడ్యూల్‌ను సవరిస్తూ మరో తీర్మానాన్ని రాజ్యసభలో ఆమోదించారు.
మేము ఉగ్రవాదులమా?: ఖర్గే
రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీరుపై డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. గతవారం తనకు రాసిన లేఖను మీడియాకు విడుదల చేయడం సరైంది కాదని అన్నారు. గతవారం రాజ్యసభ వెల్‌లో విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండగా, సీఐఎస్‌ఎఫ్ జవాన్లు రంగంలోకి దిగి వారిని బటయకు తీసుకెళ్లారు. రాజ్యసభలోకి పారామిలటరీ సిబ్బంది రావడం పట్ల ఖర్గే మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా విపక్షాలు గొంతు నొక్కేస్తున్నారని, ప్రజాస్వామ్య హక్కును అణచివేస్తున్నారని ఆరోపించారు.
సభలో పారామిలటరీ దళాన్ని అనుమతించకూడదని కోరుతూ హరివంశ్‌కు లేఖ రాశారు. అనంతరం ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. అయితే, డిప్యూటీ చైర్మన్‌కు రాసిన లేఖ సభాహక్కుల పరిధిలోకి వస్తుందని, దాన్ని బయటపెట్టడం ఏమిటని హరివంశ్ ప్రశ్నించారు. పార్లమెంట్‌లో పారామిలటరీ సిబ్బంది సేవలు ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదన్నారు. ఖర్గే స్పందిస్తూ.. తాము ప్రజాస్వామ్య విధానంలో నిరసన తెలిపామని, ఇకపై కూడా నిరసన కొనసాగిస్తామని బదులిచ్చారు. సభలో సీఐఎస్‌ఎఫ్ జవాన్లు అడ్డుకున్నారని, మేము ఉగ్రవాదులమా? అని ప్రశ్నించారు. డిప్యూటీ చైర్మన్‌కు రాసిన లేఖపై ప్రెస్‌నోట్ మాత్రమే మీడియాకు విడుదల చేశానని పేర్కొన్నారు. సభ్యులందరి కోసమే ఈ పని చేశానన్నారు.
పోలీసులను, సైన్యాన్ని తీసుకొచ్చి సభను నడిపిస్తారా? అని నిలదీశారు. ఖర్గే వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అభ్యంతరం వ్యక్తంచేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతవారం మార్షల్స్ మాత్రమే లోపలికి వచ్చారని, పారామిలటరీ సిబ్బంది రాలేదని స్పష్టంచేశారు. సభలో తప్పుడు ఆరోపణలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర మంత్రి జె.పి.నడ్డా మాట్లాడుతూ.. తాను గతంలో 40 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నానని, ప్రభావవంతమైన ప్రతిపక్షంగా ఎలా పని చేయాలో నేర్చుకోవాలంటే తన వద్దకు ట్యూషన్‌కు రావాలని కాంగ్రెస్ సభ్యులకు సూచించారు.