దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్‌ | Operation Sindoor Updates: India Has Successfully Shot Down Three Pakistani Fighter Jets, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Operation Sindoor Updates: దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్‌

May 9 2025 2:30 AM | Updated on May 9 2025 8:59 AM

Operation Sindoor: India has successfully shot down three Pakistani fighter jets

రాజస్తాన్‌లోని జైసల్మేర్‌పై పాకిస్తాన్‌ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ధ్వంసం చేస్తున్న ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌

లాహోర్‌ నుంచి కరాచీ దాకా ముప్పేట దాడులు  

తారస్థాయికి భారత్, పాక్‌ ఉద్రిక్తతలు 

పూర్తిస్థాయి యుద్ధం దిశగా పరిస్థితులు

ఆపరేషన్‌ సిందూర్‌తో కూడా దాయాది బుద్ధి తెచ్చుకోలేదు. పైపెచ్చు పనిగట్టుకుని యుద్ధ జ్వాలలను రగులుస్తోంది. భారత్‌పై భారీ స్థాయిలో సైనిక దాడులకు తెగించింది. హమాస్‌ ఉగ్ర సంస్థను తలపిస్తూ పౌర లక్ష్యాలపై ఎడాపెడా క్షిపణి, డ్రోన్‌ దాడులకు దిగింది. రాజస్తాన్‌ నుంచి కశ్మీర్‌ దాకా సరిహద్దుల వెంబడి దాడులకు పాక్‌ చేసిన యత్నాలను భారత్‌ పూర్తిస్థాయిలో తిప్పికొట్టింది. 

భారీ ప్రతి దాడులతో ముచ్చెమటలు పట్టించింది. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, పెషావర్, రావల్పిండిలపై 24 గంటల వ్యవధిలోనే రెండుసార్లు విరుచుకుపడి కీలక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు తదితరాలను తుత్తునియలు చేసింది. దాడుల ధాటికి ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ బంకర్లో తలదాచుకున్నారు! కరాచీ నౌకాశ్రయంపై మన నేవీ బాంబుల వర్షం కురిపించింది. పరిస్థితులు ఇరు దేశాల నడుమ పూర్తిస్థాయి యుద్ధం దిశగా సాగుతున్నాయి...   

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌: అవమాన భారంతో విచక్షణ కోల్పోయిన దాయాది దిద్దుకోలేని పొరపాటు చేసింది. బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి పూర్తిగా బరితెగించింది. ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారం చేయబోయి మరోసారి పరువు పోగొట్టుకుంది. భారత్‌ను సైనికంగా రెచ్చగొట్టే దుస్సాహసానికి పూనుకుని అభాసుపాలైంది. బుధవారం అర్ధరాత్రి దాటినప్పటి నుంచీ భారత్‌పై ఎడాపెడా వైమానిక దాడులకు దిగింది. 

క్షిపణులు, డ్రోన్‌ దాడులతో సరిహద్దు రాష్ట్రాల్లో పలు పౌర, సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. వాటన్నింటినీ మన సైన్యం పూర్తిగా తిప్పికొట్టడమే గాక మూడు పాక్‌ యుద్ధ విమానాలను కూల్చేసింది. ఇద్దరు పాక్‌ పైలట్లను బందీలుగా పట్టుకుంది. రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు కీలక పాక్‌ నగరాలపై ఒకే రోజు రెండుసార్లు క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అక్కడి ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు తదితరాలను నేలమట్టం చేసింది. రెండు రోజుల వ్యవధిలో దాయాదికి వరుసగా రెండో పరాభవం రుచిచూపి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. 

మరోవైపు నౌకాదళం కూడా రంగంలోకి దిగింది. పాక్‌కు జీవనాడి వంటి కరాచీ నౌకాశ్రయంపై ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ యుద్ధనౌక బాంబుల వర్షం కురిపించి 10కి పైగా నౌకలను ధ్వంసం చేసినట్టు సమాచారం. 1971 పాక్‌ యుద్ధం తర్వాత కరాచీ నౌకాశ్రయంపై దాడి ఇదే తొలిసారి. అంతేగాక ఏకంగా 20కి పైగా భారత యుద్ధ నౌకలు పాక్‌ వైపు కదులుతున్నట్టు చెబుతున్నారు. ఎల్లలు దాటిన ఉద్రిక్తతల నడుమ పరిస్థితులు పూర్తిస్థాయి యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరువైపుల నుంచీ కాల్పుల మోతతో సరిహద్దులు దద్దరిల్లిపోతున్నాయి. 

పౌర లక్ష్యాలపై పాక్‌ సైన్యం విచక్షణారహిత కాల్పులకు తెగబడుతోంది. అందుకు మన సైన్యం దీటుగా బదులిస్తోంది. ఇరు దేశాల్లోనూ సరిహద్దు రాష్ట్రాలు ఎయిర్‌ సైరన్లు, బాంబుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. పలు విమానాశ్రయాలు మూతబడ్డాయి. ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా భద్రతా బలగాలను కేంద్రం ఆదేశించింది. సైనికులకు సెలవులు రద్దు చేశారు. 

కీలకమైన సైనిక తదితర మౌలిక వ్యవస్థల వద్ద రక్షణను కట్టుదిట్టం చేశారు. పాక్‌ అత్యంత అనాగరికంగా వ్యవహరిస్తోందంటూ కేంద్రం మండిపడింది. పౌర ఆవాసాలపై విచక్షణారహితంగా డ్రోన్లు, మిసైళ్లు ప్రయోగిస్తూ హమాస్‌ ఉగ్ర సంస్థను తలపిస్తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు దుయ్యబట్టాయి. జమ్మూ, పఠాన్‌కోట్, ఉద్ధంపూర్‌ల్లో పాక్‌ క్షిపణి, డ్రోన్‌ దాడి యత్నాలను పూర్తిగా తిప్పికొట్టినట్టు సైన్యం ప్రకటించింది. పరిస్థితి అదుపు తప్పుతున్న నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. సంయమనం పాటించాల్సిందిగా ఇరు దేశాలకూ సూచించింది.


పేట్రేగిన పాక్‌ 
సరిహద్దుల వెంబడి 15 సైనిక స్థావరాలపై దాడి యత్నాలు విఫలం కావడంతో గురువారం పాక్‌ మరింతగా పేట్రేగిపోయింది. రాత్రివేళ పాక్‌ ఫైటర్‌ జెట్లు భారత్‌పై తీవ్రస్థాయిలో దాడులకు తెరతీశాయి. రాజస్తాన్‌ మొదలుకుని జమ్మూ కశ్మీర్‌ దాకా సరిహద్దుల పొడవునా పలుచోట్ల సైనిక లక్ష్యాలతో పాటు విచక్షణారహితంగా పౌర ఆవాసాలపైనా గురిపెట్టాయి. శ్రీనగర్, జమ్మూ విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశాయి. 

జమ్మూ–శ్రీనగర్‌ హైవేపై భారీ పేలుడు చోటుచేసుకుంది. రాజౌరీ జిల్లాలో పలుచోట్ల పేలుళ్లు విని్పంచాయి. పాక్‌ దాడులన్నింటినీ సైన్యం సమర్థంగా అడ్డుకుంది. సత్వారీలోని జమ్మూ విమానాశ్రయం, సాంబా, ఆర్‌ఎస్‌ పుర, అరి్నయా తదితర ప్రాంతాలపైకి కనీసం 8కి పైగా క్షిపణులు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా మధ్యలోని అడ్డుకుని కూల్చేసినట్టు ప్రకటించింది. 

మన ‘ఆకాశ్‌’, ఎంఆర్‌ఎస్‌ఏఎంతో పాటు అత్యాధునిక ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ పాక్‌ క్షిపణులు, డ్రోన్లను ఎక్కడివక్కడ కూల్చేశాయి. పఠాన్‌కోట్‌లో రెండు, జమ్మూలో ఒక పాక్‌ యుద్ధ విమానాన్ని ఎస్‌–400 వ్యవస్థ నేలకూల్చింది. వాటిలో రెండు జేఎఫ్‌–17, ఒక ఎఫ్‌–16 ఉన్నాయి. రెండు యుద్ధ విమానాలను నష్టపోయినట్టు పాక్‌ కూడా అంగీకరించింది. పఠాన్‌కోట్‌లో ఇద్దరు పైలట్లు మన బలగాలకు చిక్కినట్టు సమాచారం. ఆ వెంటనే పాక్‌పై సైన్యం విరుచుకుపడింది. 

ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్, కరాచీ, రావల్పిండిలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో రెండోసారి భారీస్థాయిలో దాడులకు దిగింది. లాహోర్‌ తదితర నగరాల్లోని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలన్నింటినీ సమూలంగా నాశనం చేసేసింది. పాక్‌లోని పంజాబ్‌ ప్రాంతంలో నెలకొన్న కీలక ఎయిర్‌బోర్న్‌ వారి్నంగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టం (ఏడబ్ల్యూఏసీఎస్‌)ను తుత్తునియలు చేసింది. పాక్‌ నగరాలు బాంబు పేలుళ్లతో దద్దరిల్లినా పౌర ఆవాసాలు, వ్యవస్థలకు నష్టం కలగని రీతిలో సైనిక వ్యవస్థలను మాత్రమే ఎంచుకుని అత్యంత కచ్చితత్వంతో దాడులు నిర్వహించినట్టు సైన్యం పేర్కొంది.

పలుచోట్ల బ్లాకౌట్‌ 
పాక్‌ దాడుల నేపథ్యంలో గురువారం రాత్రి సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సైరన్ల మోత మోగింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, గుజరాత్‌ల్లో పలుచోట్ల వైమానిక దాడుల హెచ్చరికలు జారీ అయ్యాయి. దాంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్, అమృత్‌సర్, హోషియార్‌పూర్, మొహాలీ, చండీగఢ్‌ మొదలుకుని రాజస్తాన్‌లోని జైసల్మేర్‌ దాకా పలు నగరాల్లో కరెంటు సరఫరా నిలిపేశారు. ఆయాచోట్ల రాత్రిపూట పలు డ్రోన్లతో పాటు పేలుడు శబ్దాలను గమనించినట్టు భద్రతా బలగాలు తెలిపాయి. ప్రజలు లైట్లన్నీ ఆర్పేసి ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement