కేంద్రం విడుదల చేసిన జాబితాలో మురళీనాయక్ పేరు
మనసారా జోహార్లర్పిస్తున్న రాష్ట్ర ప్రజలు
2022లో ఆర్మీలో చేరిన వీర జవాన్
బాల్యం నుంచి చదువు, క్రీడల్లో రాణింపు
సాక్షి, పుట్టపర్తి: ఆపరేషన్ సిందూర్‌లో అమరుడైన ఆంధ్ర అగ్నివీర్ మురళీనాయక్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. కేంద్రం తాజాగా ప్రకటించిన అమరుల జాబితాలో ఆయన పేరు ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆయన ప్రాణత్యాగానికి మనసారా జోహార్లు అర్పిస్తున్నారు. దేశానికి మురళీ నాయక్ చేసిన సేవలను, ఆయన వీరత్వాన్ని గుర్తుచేసుకుంటున్నారు. మురళీ నాయక్ ఆగస్టు 10, 2002న జన్మించారు. పదో తరగతి వరకు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదువుకున్నారు.
మురళీనాయక్ 2016–17 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేశారు. బాల్యం నుంచి చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించేవారు. ఆయన తల్లి స్వగ్రామం నాగినాయని చెరువు తండా కావడంతో సోమందేపల్లిలోని అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉంటూ విద్యాభ్యాసం పూర్తి చేశారు. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత అనంతపురంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదివారు. ఆ తర్వాత ఆర్మీ కోచింగ్ స్కూల్‌లో చేరి ఉద్యోగం సంపాదించారు.
2022లో మురళీనాయక్ ఆర్మీలో చేరారు. అప్పటి నుంచి తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామనాయక్ దంపతులు గోరంట్ల మండలం కల్లితండాలో స్థిరపడ్డారు. తొలుత మురళీ నాయక్ అసోంలో పని చేశారు. ఆ తర్వాత కశ్మీర్‌కు బదిలీ అయ్యారు. పహల్గాంలో పాక్ ఉగ్రవాదుల దుశ్చర్య నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్’లో 2025 మే 8న మురళీ నాయక్ వీరమరణం పొందారు.
కాల్పుల్లో చనిపోయే నాటికి మురళీ నాయక్ వయసు 22 ఏళ్లే. మురళీ వీరమరణం పొందిన మరుసటి రోజే గోరంట్ల మండలం కల్లి తండాకు భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. అదేనెల 11న సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. 2025 మే 13న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ తరఫున రూ.25 లక్షలు సాయం ప్రకటించారు.


