ఆ విషయంలో తగ్గేదేలే.. నీతి ఆయోగ్‌ భేటీలో సీఎం విజయ్‌ | Niti Aayog Meet: Tamil Nadu Cm Vijay Opposes Neet Exam | Sakshi
Sakshi News home page

ఆ విషయంలో తగ్గేదేలే.. నీతి ఆయోగ్‌ భేటీలో సీఎం విజయ్‌

Jun 11 2026 8:22 PM | Updated on Jun 11 2026 9:23 PM

Niti Aayog Meet: Tamil Nadu Cm Vijay Opposes Neet Exam

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తమిళనాడు సీఎం విజయ్ కీలక డిమాండ్లు లేవనెత్తారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్షను తీవ్రంగా వ్యతిరేకించిన విజయ్‌.. 12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య సీట్లను భర్తీ చేసేందుకు అనుమతించాలని కోరారు. దీంతో పాటు కోయంబత్తూరులో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు, పెండింగ్‌లో ఉన్న రూ.3,284 కోట్ల విద్యా నిధుల విడుదల, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఆమోదం, శ్రీలంక, పాకిస్తాన్‌లలో బందీలుగా ఉన్న తమిళ మత్స్యకారుల విడుదల కోసం కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష వల్ల గ్రామీణ, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని సీఎం విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటును కోరుతూ.. కోయంబత్తూరులో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఏర్పాటుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని సీఎం విజయ్ కేంద్రానికి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వైద్య విద్యను, అత్యాధునిక ప్రపంచ స్థాయి వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయవచ్చని ఆయన వివరించారు.

పాక్ జలసంధి ప్రాంతంలో భారతీయ మత్స్యకారుల సాంప్రదాయ చేపల వేట హక్కులను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయ్ కోరారు. ప్రస్తుతం శ్రీలంక, పాకిస్తాన్ దేశాల జైళ్లలో మగ్గుతున్న తమిళనాడు మత్స్యకారులను, వారి బోట్లను విడిపించేందుకు అత్యవసర దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర రోడ్డు రవాణా, రైల్వే మంత్రిత్వ శాఖలు కింది ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు

సమగ్ర శిక్షా అభియాన్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.3,284 కోట్ల పెండింగ్ నిధులను ముందస్తు షరతులు లేకుండా విడుదల చేయాలన్నారు. అలాగే, ఆధునిక భారతదేశ లౌకిక విలువల చాటిచెప్పే ప్రాచీన తమిళ గ్రంథం 'తిరుక్కురళ్' (Thirukkural)ను జాతీయ సాహిత్యంగా ప్రకటించాలని కౌన్సిల్ ముందు ప్రతిపాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement