‘ఎన్‌టీఏ అబుదాబి’ నిర్వాకంపై రాహుల్‌ నిప్పులు! | NEET Shock Nagpur Student Gets Abu Dhabi Centre Rahul Gandhi Slams NTA | Sakshi
Sakshi News home page

‘ఎన్‌టీఏ అబుదాబి’ నిర్వాకంపై రాహుల్‌ నిప్పులు!

Jun 20 2026 12:48 PM | Updated on Jun 20 2026 1:04 PM

NEET Shock Nagpur Student Gets Abu Dhabi Centre Rahul Gandhi Slams NTA

న్యూఢిల్లీ: వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’ (NEET) నిర్వహణ తీరుపై మరోసారి తీవ్ర దుమారం రేగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) చేసిన ఒక పొరపాటు ఒక విద్యార్థి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే కాకుండా, దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నాగ్‌పూర్‌కు చెందిన ఒక విద్యార్థికి రీ-ఎగ్జామ్ సెంటర్ ఏకంగా విదేశాల్లో (అబుదాబి) కేటాయించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం కేంద్ర ప్రభుత్వంపై, ఎన్‌టీఏపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

నాగ్‌పూర్‌కు చెందిన ఒక విద్యార్థి నెల రోజులుగా ఎంతో కష్టపడి నీట్ రీ-ఎగ్జామ్ కోసం సన్నద్ధమయ్యాడు. అయితే పరీక్షకు సరిగ్గా ఒక్కరోజు ముందు అతను తన అడ్మిట్ కార్డ్‌ డౌన్‌లోడ్ చేసుకోగా, అందులోని పరీక్షా కేంద్రం చూసి షాక్‌కు గురయ్యాడు. ఆ విద్యార్థికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ‘అబుదాబి’లో సెంటర్ కేటాయించారు. ఈ ఉదంతంపై రాహుల్ గాంధీ ఎక్స్ ‘ఎక్స్‌’ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేస్తూ,  ఎన్‌టీఏ పనితీరును  తప్పుపట్టారు. అసలు ఇలాంటి ఘోరమైన తప్పు ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ‘విద్యార్థి ఉన్న నగరంలోనే ఒక పరీక్షా కేంద్రాన్ని సరిగ్గా కేటాయించలేని విద్యా వ్యవస్థకు, ఇలాంటి అత్యున్నత స్థాయి పరీక్షలను నిర్వహించే హక్కు ఎక్కడిది?’ అని ‍ప్రశ్నించారు.

విద్యార్థుల, వారి తల్లిదండ్రుల సహనాన్ని ఎన్‌టీఏ పరీక్షిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇటీవల తాను కోటాలో విద్యార్థులను కలిసి వారి బాధలను పంచుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత విద్యా వ్యవస్థ యువతను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితిని విమర్శిస్తూ.. ‘ఇది నిజమైన విద్యా వ్యవస్థ కాదు, ఇది ఒక తరానికి చెందిన డబ్బును, సమయాన్ని, మానసిక ప్రశాంతతను నిలువునా దోపిడీ చేసిందన్నారు. పిల్లల భవిష్యత్తుతో జూదం ఆడటం ఇకనైనా ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. దేశంలోని విద్యార్థులకు బాధ్యతాయుతమైన, సమాధానం చెప్పే విద్యా వ్యవస్థ, పరీక్షా యంత్రాంగం అవసరమని ఇందుకోసం తాము పోరాడి తీరుతామని రాహుల్ గాంధీ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ‘నీట్’ మరో షాక్: ఒడిశా విద్యార్థినికి 1500 కి.మీ దూరంలో సెంటర్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement