సాక్షి, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరీక్షా పత్రాలను లీక్ చేయడం ‘ఘోర పాపం’ అని అభివర్ణించిన ఆయన.. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. పార్లమెంట్ సమీపంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు కొనసాగుతున్న వేళ.. ఎన్టీయే (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వివరాలు వెల్లడించారు.
‘తప్పు చేసిన వారిని వదిలిపెట్టం’
నీట్ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ప్రధాని పేర్కొన్నట్లు కిరణ్ రిజిజు తెలిపారు. లీక్‌కు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేశామని.. ఇప్పటివరకు 13 మంది నిందితులు జైలులో ఉన్నారని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలిగించే ఇలాంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రధాని స్పష్టం చేసినట్లు తెలిపారు. నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారని.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు అవసరమని పేర్కొన్నట్లు చెప్పారు.
విద్యార్థుల ప్రయోజనాలే ప్రాధాన్యం
నీట్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో విద్యార్థుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ప్రధాని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామని.. పరీక్ష నిర్వహణలో పారదర్శకత, భద్రత మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు రిజిజు వెల్లడించారు. లీక్ కారణంగా రద్దైన నీట్-యూజీ పరీక్షకు ప్రభుత్వం రీ-ఎగ్జామ్ నిర్వహించిందని.. పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి ఫలితాలను కూడా నిర్ణీత సమయంలో ప్రకటించామని తెలిపారు.
పరీక్షా వ్యవస్థలో మార్పులపై దృష్టి
పరీక్షా పత్రాల లీకేజీ వంటి ఘటనలు దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణ విధానంలో మరింత పటిష్ఠమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. పరీక్షల భద్రత, పారదర్శకతపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.
ఎన్టీయే భేటీలో పలు అంశాలపై చర్చ
ఎన్టీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ వివాదంతో పాటు పార్లమెంట్ సమావేశాలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారని తెలిపారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మంత్రి తప్పుకోవడం లేదా కేంద్రం ఆయనను తప్పించడం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని సీజేపీ స్పష్టం చేసింది. విద్యా వ్యవస్థలో తక్షణ సంస్కరణలు అవసరమని పేర్కొంటూ.. తమ డిమాండ్లను కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు కూడా అందజేసింది. ఆ డిమాండ్లపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా సీజేపీ నిరసనలపై స్పందించారు. యువత సమస్యలను ప్రభుత్వం వినాలని, నీట్ వ్యవహారంలో బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.


