సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సమీపంలో జరిగిన కాక్రోచ్ పార్టీ (CJP) ఆందోళనల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. యువత ఆకాంక్షలను పట్టించుకోకపోతే దేశంలో జెన్-జీ ఉద్యమం తప్పదని తాను 10 నెలల క్రితమే హెచ్చరించానని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘దాదాపు 10 నెలల క్రితం ఓ మీడియా సమావేశంలో.. యువత ఆశయాలు, ఆకాంక్షలను పరిష్కరించకపోతే మన దేశంలో జెన్-జీ నిరసన తప్పదని చెప్పాను’’ అని గుర్తుచేశారు.
‘‘ఢిల్లీలో నిన్న జరిగిన నిరసనల తర్వాత కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుత పాలన, జవాబుదారీతనం, విద్యా రంగ సంస్కరణలపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది’’ అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. యువతలో పెరుగుతున్న అసంతృప్తికి కారణాలను గుర్తించి, విద్యా వ్యవస్థలో మార్పులు, ఉద్యోగ అవకాశాలు, పాలనలో పారదర్శకత వంటి అంశాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. పార్లమెంట్ వైపు చేపట్టిన ‘చలో సంసద్’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండడంతో.. పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
About 10 months ago, I had made a comment at a media event that a Gen-Z protest is imminent in our country if the aspirations of youngsters are not addressed
After yesterday’s Delhi protest, it is high time for the Union Govt to address the demand for accountability and… pic.twitter.com/9kTIDx9Oi8— KTR (@KTRBRS) July 21, 2026


