గుణ: బీహార్ ఎన్నికల ఫలితాలపై సరదాగా మొదలైన చర్చ చివరికి రక్తపాతానికి దారి తీసింది. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 22 ఏళ్ల వయస్సున్న శంకర్ మాంఝీ తన సొంత మామల చేతిలో హత్యకు గురయ్యాడు. బీహార్‌లోని శివహార్ జిల్లాకు చెందిన శంకర్ బతుకుదెరువు కోసం గుణకు వచ్చి, కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న తన మేనమామలు రాజేష్ మాంఝీ (25), తూఫానీ మాంఝీ (27)లతో పాటు ఉంటున్నాడు.. ఈ ముగ్గురు మధ్య మొదలైన రాజకీయ వాదన చివరికి విషాదానికి దారితీసింది.
రాత్రివేళ మద్యం మత్తులో ఉన్న ఈ ముగ్గురూ బిహార్ ఎన్నికల ఫలితాల గురించి వాదించుకోవడం మొదలుపెట్టారు. పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అనూప్ భార్గవ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించిన వివరాల ప్రకారం శంకర్.. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) పార్టీకి మద్దతుదారుడు. అతని మామలు రాజేష్, తూఫానీలు జనతాదళ్ (యునైటెడ్) (జేడీయూ) పార్టీకి మద్దతు ఇచ్చారు. పార్టీలపరమైన అభిమానం వారిని ఉన్మాదులను చేసింది. మాటల యుద్ధం కాస్తా శారీరక ఘర్షణకు దారితీసింది.
రాజేష్, తూఫానీలు, శంకర్‌ను దారుణంగా కొట్టి, కనీస కనికరం లేకుండా, అతనిని పక్కనే ఉన్న బురద గుమ్మి దగ్గరకు లాక్కెళ్లారు. తరువాత అతనిని నేలకేసి కొట్టి, ఊపిరాడకుండా చేసి, బరదలో వదిలేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలపాలైన శంకర్‌ను హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యమైంది. శంకర్‌ను ఆస్పత్రికి తీసుకువచ్చేలోగానే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కాంట్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ భార్గవ నేతృత్వంలో రాజేష్ మాంఝీ, తూఫానీ మాంఝీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులిద్దరూ తమ మేనల్లుడిని తామే హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించారు. నిందితులపై పోలీసులు హత్య కేసు (సెక్షన్ 302) నమోదు చేశారు. ఈ ఘటనతో గుణలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: ‘మిషన్ బెంగాల్’: బూత్ స్థాయి నుంచే ‘మమత’పై బీజేపీ దాడి?


