
నాగ్‌పూర్: రక్షాబంధన్ వేళ ఆ భార్యాభర్తలు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ, జాతీయ రహదారిపై బైక్‌పై వెళుతున్నారు. ఇంతలో ఊహించని విధంగా ఒక ట్రక్కు వారి బైక్‌ను బలంగా ఢీకొంది. సంఘటనా స్థలంలోనే భార్య కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లేందుకు సాయం చేయాలంటూ ఆ మార్గంలో వెళుతున్నవారినందరినీ ఆమె భర్త సాయం కోసం అభ్యర్థించాడు. అయితే మృతదేహాన్ని తరలించేందుకు, అతనికి సాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అంతటి నిస్సహాయ స్థితిలో ఆ భర్త ఏం చేశాడు?
ఈ దుర్ఘటన ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మోర్ఫాటా ప్రాంతం సమీపంలోని నాగ్‌పూర్-జబల్‌పూర్ జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాదంలో గ్యార్సి అమిత్ యాదవ్ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆమె భర్త అమిత్ యాదవ్ నిశ్చేష్టుడైపోయాడు. సహాయం కోసం కనిపించిన అందరినీ ప్రాధేయపడ్డాడు. సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అమిత్ తన భార్య మృతదేహాన్ని తన ద్విచక్ర వాహనం వెనుక భాగానికి తాళ్లతో కట్టి, మధ్యప్రదేశ్‌లోని తమ స్వగ్రామానికి బయలుదేరాడు. అమిత్ జాతీయ రహదారిలో బైక్‌పై భార్య మృతదేహాన్ని తీసుకెళుతున్న దృశ్యాన్ని ఎవరో కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ దృశ్యాన్ని చూసినవారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
A video showing Amit transporting his wife's body tied to his motorcycle has gone viral on social media.#Wife #Accident https://t.co/wNwuj33TJk
— News18 (@CNNnews18) August 11, 2025
మొదట్లో అమిత్‌కు సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే అతను భార్య మృతదేహాన్ని మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్తున్న దృశ్యాన్ని చూసిన చాలా మంది అతని బైక్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే అమిత్ అందుకు నిరాకరిస్తూ, బైక్‌ను ముందుకు పోనిచ్చాడు. హైవే పోలీసులు అమిత్ వాహనాన్ని గమనించి, ఆపమని కోరారు. అయినా అమిత్ వారి మాటను లేక్కచేయలేదు. కొంతదూరం వరకూ పోలీసులు అతని బైక్‌ను వెంబడిస్తూ ఎట్టకేలకు బైక్‌ను ఆపించారు. అనంతరం పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం నాగ్‌పూర్‌లోని మాయో ఆసుపత్రికి తరలించారు. అలాగే అమిత్‌కు తగిన సాయం అందిస్తామని హామీనిచ్చారు. ఈ ఘటన ప్రస్తుత కాలంలో అడుగంటుతున్న మానవత్వాన్ని ప్రశ్నించేదిగా ఉందని పలువురు అంటున్నారు.