
శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ థాక్రే(Uddhav Thackeray) భావోద్వేగానికి లోనయ్యారు. శనివారం ముంబై వేదికగా జరిగిన శివసేన-ఎంఎన్ఎస్ కార్యక్రమంలో ఇది చోటు చేసుకుంది. అదే సమయంలో పుష్ఫ సినిమాలోని డైలాగులను ఆయన తన ప్రసంగంలో రిఫరెన్స్‌లుగా వాడారు.
ముంబై: సుమారు 20 ఏళ్ల తన సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్‌థాక్రేతో కలిసి రాజకీయ వేదిక పంచుకున్న ఉద్దవ్ థాక్రే.. భావోద్వేగానికి గురయ్యారు. శనివారం ముంబైలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ ఆవాజ్ మరాఠీచా కార్యక్రమం కోసం ఆత్రుతగా ఎదురు చూశా. రాజ్ అద్భుతంగా మాట్లాడాడు. ఇంక నేనేం మాట్లాడక్కర్లేదనుకుంటున్న. ఒక్కటి మాత్రం చెప్పదల్చుకున్నా. మా మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి ఇక్కడికి వచ్చాం. అధికారం రావొచ్చు.. పోవొచ్చు. కానీ, కలిసి ఉంటేనే బలం అని చాటి చెప్పడానికి వచ్చాం. ఒక్కటి కలిసి ఉండేందుకు మేం ఒక్కటయ్యాం. ఇక మీదట కలిసి కట్టుగా ముందుకు సాగుతాం. ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్ర బడులలో బలవంతంగా హిందీని ప్రవేశపెట్టనివ్వబోం’’ అని ఉద్దవ్ అన్నారు.
పుష్ప సినిమా నేనూ చూశా. నాకు కూడా అందులో హీరోలా గడ్డం ఉండి ఉంటే.. తగ్గేదేలే అని డైలాగ్ కొట్టేవాడిని అని ఉద్ధవ్ ఉన్నారు. దీంతో అక్కడున్న ఇరుపార్టీల కార్యకర్తలు విజిల్స్ వేశారు. మరాఠీ భాషను రక్షించేందుకు తామిద్దరం ఐక్యమైనట్లు ప్రకటించిన ఉద్దవ్.. ఇది ట్రైలర్ మాత్రమే అని, ముందు చాలా ఉందన్నట్లు ఆయన చెప్పారు.
పుష్ఫ సినిమాలో హీరో తగ్గేదేలే అన్నాడు. కానీ, ఇక్కడి ఓ ద్రోహి(ఏకనాథ్ షిండేను పరోక్షంగా ఉద్దేశించి) మాత్రం ‘దమ్ము ధైర్యం ఏమాత్రం లే’ అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. ఆ ద్రోహికి సొంత ఆలోచనలు లేవు. కేవలం తన బాస్ వచ్చాడు కాబట్టి ఆయన్ని మెప్పించడానికే ‘జై గుజరాత్’ అన్నాడు. అలాంటోడు మహారాష్ట్రకు, మరాఠీ భాషకు ఏం గౌరవం ఇచ్చినట్లు? అని ఉద్దవ్ మండిపడ్డారు.
Mumbai, Maharashtra: Shiv Sena (UBT) Chief Uddhav Thackeray says, "Gaddar (Eknath Shinde) said ‘Jai Gujarat’ just like the actor in the movie Pushpa says ‘Jhukega nahi s*la’; but this Gaddar follows ‘Uthega nahi s*la’. He doesn’t have his own thoughts. His boss came, so to please… pic.twitter.com/s7N4a0bog0
— IANS (@ians_india) July 5, 2025
మరాఠీలో మాట్లాడలేదని ఓ షాపు అతనిపై ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ మరాఠీ భాష పేరుతో చేసే గుండాగిరిని సహించేది లేదని సీఎం ఫడ్నవిస్ అన్నారు. అయితే.. ఈ వ్యవహారంలో తామూ గూండాలేమేనని, మరాఠా ప్రజలకు న్యాయం జరిగే వరకు ఈ గుండాగిరి ఇలాగే కొనసాగుతుందని ఉద్దవ్ థాక్రే స్పష్టం చేశారు.
అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ఫ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. మరీ ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు, అందులోని డైలాగులు.. హీరో మేనరిజానికి బాగా అడిక్ట్ అయ్యారు. అందుకే మొదటి భాగం రిలీజ్ అయ్యాక.. అందులోని డైలాగులను పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారాలకు వాడుకున్నాయి. పుష్ఫ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అనే డైలాగ్‌ను బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో బాగా ఉపయోగించింది.