
శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ తీరుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అసహనం వ్యక్తం చేశారు. పప్పు బాగోలేదంటూ క్యాంటీన్ ఆపరేటర్‌ను గైక్వాడ్ చితకబాదిన సంగతి తెలిసిందే. రాజకీయ విమర్శల నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఫడ్నవిస్ స్పందించారు.
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్(Sanjay Gaikwad) తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని అన్నారాయన. ‘‘ఆయన వీడియో చూశాను. ఇలాంటి ప్రవర్తన సరికాదు. ప్రజాప్రతినిధుల ప్రతిష్టను మసకబార్చేదిగా ఉంది. అధికార దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు భావించే అవకాశం ఉంది. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు ఫిర్యాదుల ద్వారా పరిష్కరించాలే తప్ప.. ఇలా దాడులతో కాదు’’ అని ఫడ్నవిస్ మీడియాతో అన్నారు.
శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్.. ముంబైలోని ఆకాశవాణి ఎమ్మెల్యే హాస్టల్‌లో పప్పు బాగోలేదంటూ క్యాంటీన్ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే గైక్వాడ్ మాత్రం తన చర్యను సమర్థించుకుంటున్నారు. పాడైపోయిన ఆహారం పెడుతున్నారంటూ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ల ప్రవర్తనలో మార్పు రావడం లేదని, అందుకే అలా చేయాల్సి వచ్చిందని అన్నారాయాన. అంతేకాదు.. వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతానని చెబుతున్నారాయన.
Shiv Sena (Shinde group) MLA Sanjay Gaikwad allegedly assaulted staff at the MLA canteen near the State Secretariat in Mumbai. #SanjayGaikwad #MLACanteen #MaharashtraPolitics #Shivsena #bjp pic.twitter.com/NCXaf1rdgJ
— YourDailyNews (@yourdailynews9) July 9, 2025
మరోవైపు సంజయ్ గైక్వాడ్ దాడి వీడియోపై ఉద్దశ్ శివసేన వర్గం భగ్గుమంది. అయితే.. సంజయ్ గైక్వాడ్‌కు వివాదాలు కొత్తేం కాదు. కిందటి ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బుల్దానా నియోజకవర్గం నుంచి షిండే శివసేన తరఫున కేవలం 841 ఓట్ల తేడాతో గైక్వాడ్ గెలుపొందారు.
2024 సెప్టెంబర్‌లో.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఆయన నాలుక కోసిన వారికి ₹11 లక్షల బహుమతి ప్రకటించారు. రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలు బీసీలకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయంటూ గైక్వాడ్ ఈ ప్రకటన చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.
2024 ఏప్రిల్‌లో.. మహారాష్ట్ర పోలీసులను ప్రపంచంలోనే అత్యంత అసమర్థమైన అధికారులుగా అభివర్ణించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఫడ్నవిస్ అసహనం వ్యక్తం చేస్తూ ఏక్‌నాథ్ షిండేకు ఫోన్ చేశారు. ఆపైన గైక్వాడ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
2023 మార్చిలో.. ఒక యువకుడిని పోలీస్ లాఠీతో కొడుతున్న వీడియో వైరల్ అయింది.
2021లో.. అప్పటి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కరోనాను రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శిస్తూ.. కరోనా గనుక తన చేతికి దొరికితే ఫడ్నవిస్ నోట కుక్కి కథ ముగిస్తానంటూ వ్యాఖ్యానించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకుగానూ బీజేపీ ఆయనపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
1987లో పులిని వేటాడానని చెబుతూ.. దాని పళ్లను లాకెట్‌గా ధరించానని చెప్పడంతో వన్యప్రాణుల చట్టం ఉల్లంఘన కింద సంజయ్ గైక్వాడ్ మీద కేసు నమోదైంది.
తాజాగా: ముంబయిలోని ఎమ్మెల్యే హాస్టల్‌లో పాడైపోయిన పప్పు ఇచ్చారన్న కారణంతో కాంటీన్ సిబ్బందిని చెంపదెబ్బతో కొట్టిన వీడియో వైరల్ అయింది.