రమ్మీ ఎఫెక్ట్‌.. మాణిక్‌కు క్రీడా మంత్రిత్వ శాఖ | Sports Ministry to Maharashtra Online Rummy Minister: Video | Sakshi
Sakshi News home page

రమ్మీ ఎఫెక్ట్‌.. మాణిక్‌కు క్రీడా మంత్రిత్వ శాఖ

Aug 1 2025 9:58 AM | Updated on Aug 1 2025 10:34 AM

Sports Ministry to Maharashtra Online Rummy Minister: Video

సీరియస్‌గా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా.. ఓ మంత్రి సీరియస్‌గా ఫోన్‌ వంకే చూస్తూ వేళ్లు కదిలిస్తున్నారు. ఏం చేస్తున్నారా? అని చూస్తే.. ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతూ కనిపించారు. ఆ వీడియో వైరల్‌ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ మంత్రిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించగా.. విపక్షాలు ఆ చర్యలపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

అసెంబ్లీలో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన మాణిక్‌రావ్‌ కోకాటేపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆయనను వ్యవసాయ శాఖ నుంచి తొలగించింది. అదే సమయంలో ఆయనకు వేరే పోర్ట్‌ పోలియోలు అప్పగించింది. మాణిక్‌రావ్‌ కొకటేకు క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు యువజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖలను కేటాయించింది ఫడ్నవిస్‌ ప్రభుత్వం. 

సిన్నార్‌ ఎమ్మెల్యే అయిన కోకటే.. ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన వీడియోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలూ ఆ వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 

ఎన్‌సీపీ(పవార్‌ వర్గం) ఎమ్మెల్యే అయిన కోకటే చర్యపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ తరుణంలో ఆయన నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర  ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్‌ పవార్‌ వివరణ తీసుకున్నారు. గురువారం ఆ నివేదికను సీఎం ఫడ్నవిస్‌కు పంపారు. ఆ వెంటనే ఆయనకు వేరే శాఖలను అప్పగించారు. అయితే.. మంత్రి వర్గం నుంచి తప్పించుకుండా శాఖను మార్చడంపై విపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి.

మూడు నెలల్లో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. ఈ వ్యవసాయశాఖ మంత్రి తీరికగా చట్ట సభలో రమ్మీ ఆడుకుంటూ కూర్చున్నారు. అలాంటి వ్యక్తిని ఇంకా మంతత్రిగా కొనసాగించడం ఏంటి? అని ఫడ్నవిస్‌ ప్రభుత్వాన్నిఎన్సీపీ(శరద్‌ పవార్‌ వర్గం) ఎంపీ సుప్రియా సులే ప్రశ్నించారు.

అయితే తాను ఫోన్‌ ఆపరేట్‌ చేస్తుండగా పాపప్‌ నోటిఫికేషన్‌ వచ్చిందని, ఉద్దేశపూర్వకంగా తాను దానిని తెరవలేదని కోకటే అంటున్నారు. ఇదిలా ఉంటే.. మరో ఎన్‌సీపీ ఎమ్మెల్యే దత్తాత్రేయ భరణేకి వ్యవసాయ శాఖను కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement