సాక్షి, అమరావతి: గుంటూరు శివారులోని గోరంట్లలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో జంగిల్‌రాజ్ కొనసాగుతోందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి జి.శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు వారు ఒక సంయుక్త ప్రకటన చేస్తూ.. ఏమన్నారంటే..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైనా, నాటి సీఎం వైఎస్ జగన్‌పైనా అసత్య ఆరోపణలు చేస్తూ, చివరకు దేవదేవుడి ప్రసాదం పేరుతో అనైతిక రాజకీయం చేశారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలని దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలైన ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ తేల్చి చెప్పాయి. దీంతో దిక్కు తోచని స్థితిలో, కనీసం పశ్చాతాపం కూడా ప్రకటించకుండా, మళ్లీ అవే అసత్యాలతో ఎదురుదాడి చేస్తున్నారు.
ఇంకా మరింత దిగజారి రాష్ట్రంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్‌తో పాటు, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి ఫోటోలతో, అవే పచ్చి అబద్ధాలతో నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఫ్లెక్సీలు వేస్తున్నారు. వాటిని మా పార్టీ నాయకులు తొలగిస్తే.. ఫ్లెక్సీలు పెట్టిన వారిపై కాకుండా, మా పార్టీ వారిపై పోలీసులు చర్య తీసుకోవడం అత్యంత హేయం.
కాగా, గుంటూరు శివార్లలోని గోరంట్లలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో పూజలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆ తర్వాత పక్కనే ఉన్న వివాదాస్పద ఫ్లెక్సీ వద్దకు చేరుకోగా, అప్పటికే కర్రలు, రాడ్లతో సిద్ధంగా ఉన్న టీడీపీ గుండాలు ఆయనపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది.
మా పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడి ఒక ఉన్మాద చర్య
శాంతియుతంగా మా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటే ఇంత బరి తెగించి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఏనాడూ ఇంత దారుణమైన పాలన చూడలేదు. ఇది ప్రజాస్వామ్య పాలనా? లేక ఆటవిక రాజ్యమా? ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నాం.


