సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకనే నెయ్యిలో కల్తీ జరిగిందన్నారు. మంత్రి లోకేష్ 208-211 పేజీలు చదువుకుంటే విషయాలు తెలుస్తాయన్నారు.
‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అల్లర్లు సృష్టిస్తోంది. బిహార్‌లో ఉన్న పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. కూటమి నేతలకు నిద్రలో కూడా వైఎస్ జగనే గుర్తుకువస్తున్నారు. చంద్రబాబు పవన్, లోకేష్‌ను చూసి హిందువులు మండిపడుతున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ కాలినడకన తిరుమలకు వెళ్లి గుండు కొట్టించుకోవాలి. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయ్యాక తిరుమలలో అరాచకాలు పెరిగాయి’’ అని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘చంద్రబాబు, పవన్ హిందూ ద్రోహులు. వారికి దేవుడిపై భక్తి లేదు. వెంకటేశ్వరస్వామిపై కూటమి నేతలు అపచారాలు ఆపాలని వేడుకుంటున్నా. బీసీ మహిళ విడదల రజినిపై దాడి చేయడం దారుణం. టీడీపీ నేతలు కట్టిన ఫ్లెక్సీలకు పోలీసులు బందోబస్తు ఏంటీ?. కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి’’ అని వెల్లంపల్లి దుయ్యబట్టారు.



