
మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దశాబ్దాల రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ఉద్దవ్ థాక్రే, రాజ్ థాక్రే మళ్లీ ఏకతాటిపైకి వచ్చారు. ఒక్కటిగా ఉంటాం.. ఇక ఒక్కటిగానే ముందు సాగుతాం అంటూ ఇద్దరు సోదరులు సంయుక్త ప్రకటన చేశారు.
శనివారం హిందీ భాష అమలును వ్యతిరేకిస్తూ జరిగిన అవాజ్ మరాథిచా కార్యక్రమం.. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ అపూర్వ కలయికకు వేదికైంది. ఈ సందర్భంగా జాతీయ నూతన విద్యావిధానంలో భాగంగా హిందీని మహారాష్ట్రలో ప్రవేశపెట్టనివ్వబోమని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వానికి ఈ ఇద్దరూ అల్టిమేటం జారీ చేశారు.

బాల్ థాక్రే వల్ల కూడా కాలేదు..
మా ఇద్దరినీ ఒక్క తాటిపై తీసుకురావాలని శివసేన వ్యవస్థాపకులు బాల్‌థాక్రే ఎంతో ప్రయత్నించారు. కానీ, ఆయన వల్ల కాలేదు. అది ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ వల్ల అయ్యింది. ఒక్క విషయం స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. మా మధ్య ఉన్న విబేధాలను పక్కనపెట్టాం అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే ప్రకటించారు.
మహారాష్ట్రలో ప్రాథమిక పాఠశాలలో హిందీ తప్పనిసరిని చేస్తూ దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే హిందీ అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శివసేన యూబీటీ-ఎంఎన్‌ఎస్‌లు సంయుక్తంగా ఈ సభను నిర్వహించాలనుకున్నాయి. ఈలోపు ఫడ్నవిస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. హిందీని కేవలం ఆప్షన్ భాషగానే ప్రకటించింది. దీంతో భారీ విజయంగా పేర్కొంటూ ఇరు పార్టీలు ఈ సభను ముంబైలో ఇవాళ నిర్వహించారు.
మీకు చట్ట సభలో అధికారం ఉండొచ్చు. కానీ మా శక్తి రోడ్లపై ఉంది. త్రిభాషా విధానంతో ముంబైను మహారాష్ట్ర నుంచి వేరు చేసే ప్రయత్నం చేశారు. కానీ, మరాఠా ప్రజల బలమైన ఐకమత్యం కారణంగానే ఆ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దమ్ముంటే.. మహారాష్ట్రను టచ్ చేసి చూడండి.. ఏం జరుగుతుందో తెలుస్తుంది అని రాజ్ థాక్రే వార్నింగ్ ఇచ్చారు. అంతకు ముందు.. శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన నేత రాజ్ థాక్రే ఛత్రపతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహారాష్ట్ర అభివృద్ధికి కలిసి పని చేస్తామని ఇరువురు సంయుక్తంగా పని చేస్తామని ప్రకటించారు.
రాజ్ థాక్రే చివరిసారిగా 2005లో ఉద్దవ్‌తో రాజకీయ వేదికను పంచుకున్నారు. అదే ఏడాది శివసేనను విడిచి ఎంఎన్‌ఎస్‌ను స్థాపించుకున్న సంగతి తెలిసిందే.
महाराष्ट्राने मनात जपलेला सुवर्णक्षण...! pic.twitter.com/kugbSPx0JU
— ShivSena - शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) July 5, 2025
శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే సోదరుడు శ్రీకాంత్ థాక్రే తనయుడే రాజ్ థాక్రే. శ్రీకాంత్ థాక్రే రాజకీయాల్లో క్రియాశీలకంగా లేనప్పటికీ.. ఆయన తనయుడు రాజ్ థాక్రే.. బాల్ థాక్రే వారపత్రిక మార్మిక్‌లో కార్టూనిస్ట్‌గా పనిచేశాడు. అక్కడి నుంచే ఆయన రాజకీయ ప్రస్థానానికి పునాది పడింది. అయితే..
90వ దశకంలో శివసేనలో రాజ్ థాక్రేకు మంచి ప్రజాదరణ ఉండేది. పార్టీ శ్రేణులు, బాల్ థాక్రే అభిమానులు రాజ్‌నే వారసుడిగా భావించేవారు. కానీ 2003లో బాల్ థాక్రే తన కుమారుడు ఉద్ధవ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాడు. దీంతో రాజ్ అసంతృప్తికి లోనయ్యారు. తదనంతర పరిణామాలతో.. 2006లో శివసేనను విడిచిపెట్టి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అనే కొత్త పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి ఈ సోదరుల మధ్య రాజకీయంగా తీవ్ర విభేదాలు కొనసాగుతూ వచ్చాయి.
