
సందర్భం
జూలై 9 నాటి, సాక్షి పత్రిక సంపా దకీయం– ‘ఠాక్రే సోదరుల యుగళం’ చదివాక, మరిన్ని వాస్తవాలు తెలియ జేయటానికి ఈ విశ్లేషణ. మరాఠీ అస్మిత (ఉనికి), మరాఠీ యువత ఉద్యోగావకాశాల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా 1966 జూన్ 19న ఏర్పాటైన శివసేన ‘మరాఠీ మానసాంచా హక్ ఆని న్యాయ సాఠీ’ (మరాఠీ వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం) అనే నినాదం ఆ రోజుల్లో యువతను ఆకట్టుకుంది.
భూమి పుత్రుల (సన్స్ ఆఫ్ సాయిల్) ఉద్యోగ సమస్యలు పరిష్కరిస్తూ, చట్ట సభలో వారి గొంతు వినిపించాలని మొదట ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు, తర్వాత విధాన స¿ý కు ప్రతినిధులన పంపటంతో రాజకీయాలతో ప్రమేయం లేని శివసేన, రాజకీయ రంగు పులుముకుంది.
1960, 1970 దశకాలలో కమ్యూనిస్టులకు నిలయం బొంబాయి నగరం అనేవారు. శివసేన రాకతో క్రమేణా కమ్యూనిస్టులు ఈ నగరంలో తెరమరుగు కావటం అప్పట్లో కాంగ్రెసుకు కూడా కలిసొచ్చింది. 1984 నుండి రైట్ వింగ్ జాతీయ పార్టీ అయిన భాజపాతో చేతులు కలిపిన శివసేన 1995లో కాషాయ కూటమితో మహారాష్ట్రలో (శివ షాహి) అధికారం చేజిక్కించుకుని, రాష్ట్రంలో కాంగ్రెసుకు ముఖ్య విరోధిగా ఎదిగింది. సుమారు నాలుగు దశాబ్దాలు పార్టీ అధినేత బాలా సాహెబ్ ఠాక్రే, సర్వం తానై పార్టీని రిమోట్ కంట్రోల్ శైలిలో, పకడ్బందీగా నడిపించారు (అడపా దడపా వలసలు మినహా).
బాల్ ఠాక్రే సోదరుడు శ్రీకాంత్ కొడుకు స్వరరాజ్. ఈయన్నే రాజ్ అని పిలుస్తారు. చిన్నప్పటి నుండీ సాహెబ్‌తో చనువుగా ఉండేవాడు. తొమ్మిది పదేళ్ల ప్రాయం నుండే అతడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని పార్టీ మీటింగుకు తరచుగా హాజరయ్యేవారు బాల్ ఠాక్రే. పెద నాన్న ముఖ కవళికలు కలిగిన రాజ్ ఆయనలాగే పొలిటికల్ కార్టూన్లు గీయటం హాబీగా చేసుకున్నారు.
బాలా సాహెబ్ హావ భావాలు, ఆయన ఉపన్యాస శైలి, బాడీ లాంగ్వేజ్‌ను అప్పటినుండే పుణికిపుచ్చుకున్న రాజ్‌ను, కాలేజీ రోజుల్లోనే శివసేన విద్యార్థి విభాగం ‘భారతీయ విద్యార్థి సేన’ చీఫ్‌గా నియమించి రాజకీయ సెలయేటిలోకి దించారు బాలా సాహెబ్.
1990 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధినేతకు కుడి భుజంగా మెదిలిన రాజ్‌ను... మున్ముందు అతడే పార్టీ పగ్గాలు చేపట్టే సాహెబ్ వారసుడు అని అప్పట్లో కార్యకర్తలు చెప్పు కోసాగారు. మరాఠీ యువతకు కొత్త ఒరవడి చూపిస్తూ, పార్టీ లోకి వారిని చేర్చుతూ నవ చైతన్యం ప్రోదిచేశారు రాజ్.
అయినా, పుత్ర వాత్సల్యం ప్రభావమో, మరే కారణమో తెలియదు కానీ రాజకీయాలకు బహుదూరంగా ఉన్న తన చిన్న కొడుకు ఉద్ధవ్ ఠాక్రేను 2002 నుండి రాజకీయాల వైపు మరల్చటం మొదలెట్టారు బాలా సాహెబ్. 2003లో జరిగిన శివసేన కార్యకర్తల శిబిర్‌లో ఉద్ధవ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమించారాయన. అది రాజ్‌కు అస్సలు మింగుడు పడలేదు. ఆ లగాయతు పార్టీలో ఉద్ధవ్, రాజ్ మధ్య అంతర్గత యుద్ధం ముదిరింది.
చివరికి 2005 నవంబర్‌లో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, నాలుగు నెలల తర్వాత (మార్చి 2006) సొంత కుంపటి, ‘మహారాష్ట్ర నవ నిర్మాణ సేన’ (ఎమ్‌ఎన్‌ఎస్) ఏర్పాటు చేసు కున్నారు రాజ్ ఠాక్రే. కానీ, రాజ్‌కు అనుకున్న ఫలితం దక్క లేదు. ఎమ్‌ఎన్‌ఎస్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 13 సీట్లతో ఖాతా తెరిచింది. అయితే శివసేన ఓట్లను చాలా వరకు చీల్చింది. ఆ తర్వాత 2014, 2019ల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమై, మొన్నటి 2024 ఎన్నికల్లో 1.55 ఓటింగ్ శాతంతో ఆ ఒక్క సీటును సైతం పోగొట్టుకుంది.
గత ఇరవై సంవత్సరాల నుండి ఉత్తర–దక్షిణ ధ్రువాలుగా ఉన్న ఈ సోదరులు మొన్నటి (జూలై 5) హిందీభాష వ్యతిరేక ఉద్యమ విజయోత్సవ ర్యాలీలో ఒకే వేదిక పైకి వచ్చినప్పటికీ, రాజ్ ఠాక్రే వ్యవహార తీరులో అనుకున్న స్పందన కనిపించ లేదని కొందరు విశ్లేషకుల అభిప్రాయం.
రాజ్ దూకుడు వైఖరి, ఉద్ధవ్ నిదానమే ప్రధానం పద్ధతి వల్ల రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇరుపార్టీలూ సీట్లు సర్దుబాటు చేసుకుని, ఓటర్ల ముందుకు రావటం క్లిష్ట సమస్యే కావచ్చు. అదీకాక, ఉద్ధవ్ కొడుకు, మాజీ మంత్రి ఆదిత్య; రాజ్ కొడుకు అమిత్ (మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు)ల రాజకీయ భవిష్యత్తులు కూడా ఈ కలయిక నేపథ్యంలో ఆలోచించాల్సిన మరో కోణం.
కాంగ్రెస్ దోస్తీ పుణ్యమా అని శివసేన (ఉద్ధవ్) పార్టీకి గత లోక్‌సభ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు చాలానే కలిసి వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీకి ఎమ్‌ఎన్‌ఎస్‌తో స్నేహం కారణంగా ఆ మైనారిటీ ఓట్లే కాక ఉత్తర భారతీయుల ఓట్లు కూడా మున్ముందు దూరం కావచ్చు.
‘రాజ్ ఠాక్రే బహిరంగ సభలో జనాన్ని ఆకర్షించవచ్చు కానీ, ఆయన భాషణ్ బ్యాలెట్ లోకి ఓట్లను తేలేద’ని సీనియర్ మరాఠా అధినేత, శరద్ పవార్ గతంలో ఒకసారి ఘంటాపథంగా చెప్పారు. అది వాస్తవం కూడా. ఏది ఏమైనా రాజ్ ఠాక్రే, తన అన్నయ్య ఉద్ధవ్‌తో రాజకీయ మైత్రి నెరపడానికి కారణం ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఓటు బ్యాంక్‌కు చెక్ పెట్టడమే కావచ్చు.
అయితే ఈ కలయిక ‘మహా వికాస్ అఘాడీ’ కూటమిని కూడా ఇరకాటంలో పడేసింది. చివరిగా, ఠాక్రే సోదరులు కలిసిపోయే ఎపిసోడ్‌కు స్క్రిప్ట్ రైటర్ రాష్ట్ర బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసే అని అంటున్న స్థానిక విశ్లేషకుల మాటా గమనార్హమే!
జిల్లా గోవర్ధన్
వ్యాసకర్త విశ్రాంత పీఎఫ్ కమిషనర్, ముంబై
మొబైల్ : 98190 96949