ఎమ్మెల్యేలకు దేవేంద్ర ఫడ్నవీస్‌ తీపి కబురు

Cabinet Expansion Soon in Maharashtra: Devendra Fadnavis - Sakshi

శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ

నాగపూర్‌లో విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం ప్రకటన

భవిష్యత్‌లోనూ ఉద్ధవ్‌తో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం

ఎమ్మెన్నెస్‌ అధినేత రాజ్‌ఠాక్రే మంచి మిత్రుడని వెల్లడి  

సాక్షి, ముంబై: మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందోనని కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ శుభవార్త ఆందించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని నాగ్‌పూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఫడ్నవీస్‌ ప్రకటించారు. త్వరలో అసెంబ్లీ కార్యకలాపాల నిర్వాహణ కమిటీ ముహూర్తం ఖరారుచేసి తేదీ ప్రకటిస్తుందని ఆయన అన్నారు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గం, ఫడ్నవీస్‌ వర్గం ఎమ్మెల్యేలలో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా గత మూడు నెలలుగా అసంతృప్తితో బీజేపీ ప్రభుత్వంలో కొనసాగుతున్న శిందే వర్గం ఎమ్మెల్యేల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

అయితే కరోనా మహమ్మారి కారణంగా నాగ్‌పూర్‌లో జరగాల్సిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ముంబైలో చాలా తక్కువ రోజులు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి నాగ్‌పూర్‌లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రెండు వారాలపాటు కచ్చితంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలకు అభ్యంతరం లేకుంటే నూతన సంవత్సర వేడుకలు నాగ్‌పూర్‌లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని ఫడ్నవీస్‌ స్పష్టం చేశారు. 


ఉద్ధవ్‌తో కలవం.. రాజ్‌ ఠాక్రే సత్సంబంధాలు

ఇదిలాఉండగా భవిష్యత్తులో ఉద్ధవ్‌ ఠాక్రేతో చేతులు కలిపే సమస్యే లేదని విలేకరులడిగిన ఓ ప్రశ్నకు ఫడ్నవీస్‌ సమాధానమిస్తూ స్పష్టం చేశారు. ఉద్ధవ్‌ తన మనసుకు చాలా బాధ కల్గించారని, ఆయనతో ఇకపై చేతులు కలిపే ప్రసక్తేలేదని అన్నారు. ఎమ్మెన్నెస్‌తో పొత్తు పెట్టుకుంటారా? అని విలేకరులడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పార్టీలు వేరైన అనేక ఏళ్లుగా రాజ్‌ ఠాక్రేతో తమకు సత్సంబంధాలున్నాయి. ఆయన తనకు మంచి మిత్రుడని, రాజకీయంగా కాకపోయిన మంచి మిత్రులుగా కలిసే ఉంటామని ఫడ్నవీస్‌ వెల్లడించారు. 


మూడునెలలుగా పెండింగ్‌లోనూ.. 

ఏక్‌నాథ్‌ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్‌ కలిసి కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెల రోజులకు మంత్రి వర్గ విస్తరణ జరిగింది. మొదటి దశ మంత్రివర్గ విస్తరణ జరిగి దాదాపు మూడు నెలలు కావస్తోంది. అయినప్పటికీ రెండో దశ విస్తరణకు ఇంకా ముహూర్తం లభించకపోవడంపై ఎమ్మెల్యేలలో అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా శిందే వర్గం ఎమ్మెల్యేలలో అసంతృప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దీంతో వారిని సంతృప్తి పరిచేందుకు త్వరలో రెండో దశ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో ప్రకటించారు. కాని ఇంతవరకు దాని ఊసు ఎత్తడం లేదు. 


మహిళలకు దక్కని ప్రాధాన్యం

అప్పట్లో ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటుతో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం రద్దయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు నెల రోజులకు మొదటి దశ మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో శిందే, ఫడ్నవీస్‌ వర్గానికి చెందిన తొమ్మిది మంది చొప్పున ఇలా 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగతావారికి ఆవకాశం దొరక్కపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఈ మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఇటు మహిళా వర్గం నుంచి, అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది. దీంతో రెండో దశ మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని అందులో మహిళలకు చోటు కల్పిస్తామని అప్పట్లో అందరినీ బుజ్జగించే ప్రయత్నం జరిగింది. 

రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తి
ముఖ్యంగా అప్పట్లో ఏక్‌నాథ్‌ శిందేతోపాటు శివసేన నుంచి బయటపడిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలోని మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఎంతో ఆశపడ్డారు. కానీ ఆశ నిరాశకు గురిచేసింది. శిందే వర్గం ఎమ్మెల్యేలలో నెలకొన్న అసంతృప్తి రోజురోజుకు తీవ్రరూపం దాల్చసాగింది. ఫలితంగా శిందేపై తిరుగుబాటుచేసి సొంత గూటిలోకి (ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం) చేరే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ అదే జరిగితే బీజేపీ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయం. ఆ పరిస్ధితి రాకముందే శిందే, ఫడ్నవీస్‌ జాగ్రత్త తీసుకున్నారు. చివరకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతామని ఫడ్నవీస్‌ ప్రకటించి ఈ అంశానికితెరదించారు. (క్లిక్ చేయండి:​​​​​​​ మరో ‘మహా’కూటమి?.. ఉద్ధవ్‌కు చెక్‌ పెట్టేందుకు పావులు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top